కాండం తొలుచు పురుగు.. నివారిస్తేనే లాభాలు | - | Sakshi
Sakshi News home page

కాండం తొలుచు పురుగు.. నివారిస్తేనే లాభాలు

Mar 11 2026 8:54 AM | Updated on Mar 11 2026 8:54 AM

అలంపూర్‌: వరికి అధికంగా ఆశించే పురుగులలో కాండం తొలుచే పురుగు ఒకటి. ఈ పురుగునే మొవ్వ పురుగుగా పేర్కొంటారు. ఇది ప్రధానంగా నారు నుంచి పైరు పాలు పోసుకోనే దశ వరకు ఆశిస్తుంది. వరిలో అధిక దిగుబడికి పురుగు నివారణతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏడీఏ సక్రియనాయక్‌ రైతులకు సూచిస్తున్నారు.

పురుగు జీవిత చక్రం :

తల్లి పురుగు కనీసం 300 గుడ్ల వరకు పెడుతుంది. ఒక్కో గుంపులో 20 నుంచి 80 గుడ్లు ఉంటాయి. ఈ గుడ్లు 5 నుంచి 7 రోజులలో పొదిగి పురుగులు బయటికి వస్తాయి. లార్వా దశ పూర్తి కాలం 30 నుంచి 40 రోజులు ఉంటుంది. పూర్తి జీవిత చక్రం 70 రోజుల్లో పూర్తవుతుంది.

నష్టపరిచే విధానం :

● చిరు పొట్ట ఏర్పడిన తర్వాత పురుగు ఆశిస్తే వెన్నులో నుంచి గింజలకు పోషకాలు అందక అవి తాలుగా మారుతాయి.

● తల్లి రెక్కల పురుగు గుడ్లను ఆకు చివరిపై భాగంలో గుంపులుగా పెట్టి ఉదరం చివర గల వెంట్రుకలతో కప్పి ఉంచుతుంది.

● ఈ పురుగులు గుంపులుగా మొక్క పైభాగంలో చేరి ఆకు తొడిమపై నున్న పత్ర హరితాన్ని గోకి తింటాయి.

● పూర్తిగా ఎదిగిన పురుగు వరి కాండంలో కోశస్త దశకు చేరుకుంటాయి.

●పైరు పిలకలు వేసే దశలో గుడ్ల నుంచి వెలుబడిన వెంటనే మొదట దశ పిల్ల పురుగులు ఆకు కొమ్మకు చేరుకొని అక్కడ పత్రహరితాన్ని గోకి తింటాయి.

● పంటల్లో ఈ పురుగు చేసే నష్టం వలన మొక్క ఆకులపై తెల్లని చారలుగా ఏర్పడతాయి.

● పురుగు కాండం లోపలికి చేరి కణజాలాన్ని తినడం వలన మువ్వ ఆకులు విడిపడక మువ్వ కోళ్లు ఏర్పడుతుంది.

నారు మడి నుంచే జాగ్రత్తలు :

నారు తీయడానికి వారం రోజుల ముందు కార్బోఫ్యూరాన్‌ గుళికలు సెంటు నారుమడికి 170 గ్రాము లు చొప్పున నీటిలో ఇసుకతో కలిపి చల్లుకోవాలి. నారు నాటేటప్పుడు నారు చివర్లు తుంచి వేయాలి.

పంటలో నివారణ చర్యలు :

వరి పిలకలు తొడిగే దశలో లీటరు నీటికి 2 మి.లీ క్లోరోఫైరిపాస్‌ కలిపి పిచికారీ చేసుకోవాలి. అంకురం దశలో 10 నుంచి 15 రోజుల సమయంలో ఎకరానికి 8 కిలోల కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ గుళికలు చల్లుకోవాలి. పురుగు మందులైతే క్లోరో ఫైరిపాస్‌ 2 మి.మీ, అసిఫేట్‌ 1.5 గ్రాములు, కార్టాప్‌ హైడ్రో క్లోరైడ్‌ 2.0 గ్రాములు లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే ఫలితం ఉంటుంది.

కాండం తొలుచు పురుగు ఆశించన వరి పంట

వరి కాండంను తొలుచుతున్న పురుగు

పాడి–పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement