● టవర్ ఎక్కి ఆత్మహత్యకు
యత్నించిన మహిళ
పెంట్లవెల్లి: మండలంలో అలివి పట్టు పంచాయితీ ఓ మహిళ ఆత్యహత్య చేసుకునేందుకు యత్నించిన పరిస్థితికి దారితీసింది. వివరాలు ఇలా.. మల్లేశ్వరంలో సమీపంలోని కృష్ణానది బ్యాక్‌వాటర్‌లో అలివి వలలతో పాటు ఇతర వలలతో చేపల వేట సాగించేందుకు కొందరు అడ్డాలు ఏర్పాటు చేసుకున్నారు. సింగోటం పట్టు అనే అడ్డాలో కొన్నేళ్ల క్రితం వరకు కర్నూల్ జిల్లా కొండపాటూరు గ్రామానికి చెందిన గోపాల్ అలివి వలలతో చేపల వేట సాగించేవాడు. ఆయన మరణాంతరం మల్లేశ్వరం గ్రామానికి చెందిన మంగమ్మ ఈ అడ్డాలో చేపల వేట సాగిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఆమె తన అడ్డాను గ్రామానికి చెందిన తెలుగు శేఖర్ అనే వ్యక్తికి రూ.7 లక్షలకు లీజుకు ఇచ్చింది. దీంతో లీజు డబ్బులు తమకు ఇవ్వాలంటూ కొండపాటూరు గోపాల్ కుమారులు రవి, మధు కొన్ని రోజులుగా మంగమ్మను అడుగుతూ వచ్చారు. లేదంటే మా నాన్నకు చెందిన అడ్డాలో చేపలు పట్టుకోనియ్యమని బెదిరించారు. దీంతో ఆమె సోమవారం గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి పై నుంచి దూకుతానంటూ హల్‌చల్ చేసింది. ఆంధ్రాకు చెందిన వారు తనను బెదిరిస్తున్నారని, వారి నుంచి కాపాడాలని వేడుకొంది. ఎస్‌ఐ రామన్‌గౌడ్ అక్కడికి చేరుకొని ఆమెకు నచ్చజెప్పి కిందికి దించారు. ఈ ఘటనపై ఇరుపక్షాలతో మాట్లాడతామని తెలిపారు.


