అచ్చంపేట రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ మహిళా సదస్సులో నల్లమల ప్రాంతానికి చెందిన మహిళా సర్పంచు బొజ్జ గీత పాల్గొననున్నారు. జాతీయ సదస్సుకు 16 మంది మహిళా సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయగా... నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లి గ్రామానికి చెందిన బొజ్జ గీత ఉన్నారు. ఈ మేరకు ఈమె బుధవారం జరిగే మహిళా ప్రజాప్రతినిధుల జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు. సదస్సుకు రాష్ట్రపతి హాజరు కానున్నారని తెలిసింది. కాగా సర్పంచు బొజ్జ గీత అమెరికాలో ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పాల్గొని, గ్రామ ప్రజలకు మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందారు. అలాగే ఆమె భర్త బొజ్జ అమరేందర్‌రెడ్డి సీఎం ప్రవాసీ ప్రజావాణి రాష్ట్ర కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.


