పంటపొలాలు, బోరుబావులు నాశనం | - | Sakshi
Sakshi News home page

పంటపొలాలు, బోరుబావులు నాశనం

Mar 11 2026 8:04 AM | Updated on Mar 11 2026 8:04 AM

పెద్దతిప్పకు క్వారీ ఏర్పాటు చేయొద్దని రైతుల విన్నపం

క్వారీ ఏర్పాటుపై అదనపు కలెక్టర్‌ ప్రజాభిప్రాయ సేకరణ

చిన్నచింతకుంట: పెద్ద తిప్పకు క్వారీ ఏర్పాటు చేయడంతో పంటపొలాలు, బోరు పంపులు నాశనమవుతాయని.. మా బతుకులు ఆగమవుతాయని మైనింగ్‌ క్వారీ ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని అమ్మాపురం రైతులు, ప్రజలు విన్నవించారు. అమ్మాపురం సమీపంలోని సర్వేనం 89 యన్‌. నవీన్‌కుమార్‌, యం. లక్ష్మికి 4.95 హెక్టర్ల భూమి విస్తీర్ణంలో 90.970 క్యూబిక్‌ మీటర్ల మైనింగ్‌కు వారి ప్రతిపాదనతో ప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు మంగళవారం క్వారీ ఏర్పాటుపై హైదరాబాద్‌కు చెందిన పర్యావరణ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు, గ్రామప్రజల అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ హరిప్రియ, పర్యావరణ పరిరక్షణ అధికారి సురేశ్‌ హాజరై అభిప్రాయాలు సేకరించారు. ముందుగా పర్యావరణ పరిరక్షణ కమిటీ అధికారులు క్వారీ ఏర్పాటుపై ప్రభుత్వ నిబంధనలు, నియమాలను ప్రజలు, రైతులకు వివరించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. పెద్ద తిప్పకు క్వారీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ మాత్రమే కొనసాగుతుందన్నారు. రైతులు, ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు. అభిప్రాయ సేకరణ జాబితాను సంబంధిత ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. దీంతో పలువురు రైతులు మాట్లాడుతూ.. మైనింగ్‌ క్వారీ ఏర్పాటుతో పంట పొలాలు నాశనమవుతాయన్నారు. బోరుపంపులు ధ్వంసమవుతాయని ఆరోపించారు. దీంతో చిన్న, సన్నకారు రైతులు పంటలు పండించుకోలేక భూములను వదిలేసి పోవాల్సి వచ్చే పరిస్థితులు ఏర్పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు రైతులు గుట్టకు క్వారీ ఏర్పాటు చేస్తే పంట పొలాలకు బీటలు ఏర్పడుతాయన్నారు. అందుకు ప్రభుత్వ నిబంధనల మేరకు క్వారీ ఏర్పాటు చేసుకోవచ్చిని తెలిపారు. అలాగే పలువురు ప్రజలు మాట్లాడుతూ.. క్వారీ ఏర్పాటుతో గ్రామాభివృద్ధికి నిధులు సమకూరుతాయని తమ అభిప్రాయాని తెలిపారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ అంతరించి వన్యప్రాణులకు ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిపారు. మరికొందరు హిందూబాంధవులు మాట్లాడుతూ.. కురుమూర్తి స్వామి మనోభావాలు దెబ్బతింటాయని హెచ్చరించారు.

భావితరాలకు ఇబ్బందులు

పెద్ద తిప్పకు మైనింగ్‌ క్వారీ ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో భావితరలాకు ఇబ్బందులు ఏర్పడుతాయని రైతు శ్రీధర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద తిప్పచుట్టు చిన్న, సన్నకారు రైతులు ఉన్నారన్నారు. ఇక్కడ క్వారీ ఏర్పాటు చేస్తే దుమ్ముధూళితో వ్యవసాయ భూములు పంటలకు పనికి రాకుండా పోతాయన్నారు. పంటలు పండించుకోలేక భావితరాలలో భూములను అమ్ముకొని పొట్టకూటి కోసం వలస పట్టే పరిస్థితులు ఏర్పడుతాయని తెలిపారు.

ఆత్మహత్యే శరణ్యం

గుట్టకు క్వారీ ఏర్పాటు చేస్తే మాకు ఆత్మహత్యలే శరణ్యమని అమ్మాపురం రైతులు బుచ్చన్న, అంజన్న తెలిపారు. క్వారీ సమీపంలో మాకు ఎకరం, అర ఎకరం పొలాలు ఉన్నాయన్నారు. ఈ పొలాలకు ఇప్పటికే బోర్లు వేస్తే నీరు పడడంలేదు. క్వారీ ఏర్పాటుతో బోర్లు పడుతాయన్న ఆశ ఉండదు. అలాగే మా పంట పొలాల్లో దుమ్ము ధూళి ఏర్పడి పంటలు పండే అవకాశం ఉండదు. దీంతో మాకు ఆత్మహత్యలే శరణ్యం.

భక్తుల మనోభావాలుదెబ్బతింటాయి

కురుమూర్తి స్వామి ఏడు కొండలలో ఒక కొండను తొలిచేందుకు అధికారులు పూనుకున్నారని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్వరమేష్‌ ఆరోపించారు. కురుమూర్తి స్వామికి ఏడు కొండలు ఉన్నాయని.. ఏడు ఒండలలో ఒక కొండను తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కొండను తొలగిస్తే కురుమూమూర్తి స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపారు. వీటితోపాటు పర్యావరణం, పరిరక్షణతో పాటు జంతువులు నశించిపోతాయంటూ 20021లోనే ఇక్కడ క్వారీ ఏర్పాటు చేయవద్దంటూ గ్రామప్రజలు, రైతులతో కలిసి అప్పట్లో కలెక్టరేట్‌లో విన్నవించామన్నారు. మా విన్నపాన్ని మన్నించి అధికారులు క్వారీ ఏర్పాటును విరమించారు. మళ్లీ ఇప్పుడు క్వారీ ఏర్పాటు చేస్తామంటూ వచ్చారు. కురుమూర్తి స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవరిస్తే సహించబోమన్నారు.

ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన రైతులు, ప్రజలు

బ్లాస్టింగ్‌తో భూప్రకంపనలు

క్వారీ వద్ద రాయిని తొలగించేటప్పుడు బ్లాస్టింగ్‌తో గుట్టల చుట్టూ పరిసర ప్రాంతాల్లో భూమి కంపిస్తుందని గ్రామస్తుడు బలరాం తెలిపారు. ఈ భూప్రకంపనలతో క్వారీ సమీపంలోని రైతులు భయబ్రాంతులకు గురవుతారన్నారు. క్వారీ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల రైతులు భయబ్రాంతులతో పంటపొలాలను విడిచిపెట్టిపోతారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement