రోడ్డు ప్రమాదంలోఒకరి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలోఒకరి దుర్మరణం

Mar 11 2026 8:04 AM | Updated on Mar 11 2026 8:04 AM

ఉండవెల్లి: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని కంచుపాడు గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఒకరు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాలకు చెందిన మణెమ్మ(60), నాగరాజు, మద్దిలేటి, కృష్ణవేణి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కారులో ఉండవెల్లి మండలం కంచుపాడులోని రేణుక ఎల్లమ్మ ఆలయానికి బయలుదేరారు. ఉండవెల్లి శివారుకు రాగానే ఎదురుగా బైక్‌ రావడంతో దానిని తప్పించబోయి కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా కర్నూలులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మణెమ్మ మృతిచెందారు. మణెమ్మ చిన్న కుమారుడు మధుసూదన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌ తెలిపారు. కాగా.. గాయపడిన వ్యక్తులు కర్నూలు జిల్లా ఎంపీ నాగరాజుకు సంబంధించిన కుటుంబీకులుగా తెలిపారు.

కారు, బైక్‌ ఢీ..వృద్ధుడి మృతి

గద్వాల క్రైం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం గద్వాల పట్టణంలో చోటు చేసుకుంది. మల్దకల్‌ మండలం సద్దనోన్నిపల్లికి చెందిన గోపాల్‌ (58) పని నిమిత్తం బైక్‌పై గద్వాలకు వచ్చి తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. మెళచెరువు క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే మల్దకల్‌ నుంచి గద్వాలకు వస్తున్న కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో గోపాల్‌ అక్కడిక్కడే పడి మృతి చెందాడు. వేరొక ప్రమాదంలో పట్టణానికి చెందిన వీరేష్‌ బైక్‌పై ఫ్‌లై ఓవర్‌ మీదుగా ఇంటికి వెళ్తుండగా కారు డ్రైవర్‌ ఢీ కొట్టాడు. దీంతో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పై రెండు ప్రమాదాలపై పట్టణ ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్‌ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రమాదాలకు కారణమైన ఇద్దరు డ్రైవర్లు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.

కాలిన గాయాలతో యువకుడి మృతి

మహబూబ్‌నగర్‌ క్రైం: పంట పొలాల మధ్యలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. రూరల్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. కోయిలకొండ మండలం గార్లపాడ్‌కు చెందిన కావలి శివకుమార్‌(23) సోమవారం రేగడిగడ్డతండా శివారులోని పంటపొలాల మధ్య అనుమానాస్పదంగా మృతిచెందాడు. మంగళవారం ఉదయం స్థానికులు చూసి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుడు కావలి శివకుమార్‌ మహబూబ్‌నగర్‌ నగరంలో కార్ల పెయింటింగ్‌, డెంటింగ్‌ వర్క్‌ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. రోజు గార్లపాడ్‌నుంచి మహబూబ్‌నగర్‌ వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో మూడురోజుల కిందట ఇంట్లో నుంచి వచ్చిన శివకుమార్‌ ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే మృతుడు శరీరం కాలిన గాయాలు కన్పించాయి. ముఖంతోపాటు ఇతర శరీర భాగాలు కొంత కాలిపోయాయి. ఘటనా స్థలంలో అగ్గిపెట్టే, ప్లాస్టిక్‌ బాటిల్‌, టిఫిన్‌ బాక్స్‌ లభ్యమయ్యాయి. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి తగలపెట్టారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ మేరకు వెంకటమ్మ ఫిర్యాదుపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చికిత్స పొందుతూ

యువకుడు మృతి

అయిజ: మండలంలోని చిన్న తాండ్రపాడుకు చెందిన భరత్‌కుమార్‌ (18) సోమవారం రాత్రి పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కర్నూలు ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ.. మంగళవారం మృతిచెందాడు. ఆంజనేయులు, ఈదమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు భరత్‌కుమార్‌ మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

లిఫ్ట్‌ అడిగిన మహిళపై సామూహిక అత్యాచారం

జడ్చర్ల: మోటార్‌బైక్‌పై లిఫ్ట్‌ అడిగిన మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. బాదేపల్లి శివారులోని ఓ కాలనీకి చెందిన వివాహిత మహిళ(35) పట్టణంలో పనులు ముగించుకుని తన ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తనకు తెలిసిన ఓ వ్యక్తి మరో వ్యక్తితో కలిసి మోటార్‌బైక్‌పై వెళ్తుండగా ఆమె గమనించి లిఫ్ట్‌ అడిగింది. దీంతో మోటార్‌ బైక్‌పై ఉన్న ఇద్దరూ ఆమెను ఎక్కించుకుని వెళ్లారు. అయితే మార్గమధ్యలో ఉన్న నిర్జన ప్రదేశానికి వెళ్లిన వెంటనే చీకట్లోకి బైక్‌ను మళ్లించి ఆమెను భయబ్రాంతులకు గురిచేసి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధిత మహిళ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత మహిళ చెప్పిన సమాచారం ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement