● రంజాన్ మాసంలో ప్రత్యేక వంటకం
● సంప్రదాయమైన బలవర్ధకమైన ఆహారం
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హలీమ్, హరీస్ దుకాణాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: రంజాన్ మాసం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది హలీం (హరీస్). రంజాన్ మాసంలోనే ప్రత్యేకంగా తయారుచేసే ఈ వంటకం కోసం ఎంతోమంది ఎదురుచూస్తారు. ముస్లింలే కాకుండా అన్ని మతాలవారు వీటిని ఇష్టంగా ఆరగిస్తున్నారు. మహబూబ్‌నగర్ నగరంతోపాటు జిల్లాలోని పలు పట్టణ ప్రాంతాల్లో హరీస్, హలీమ్ దుకాణాలు వెలిశాయి. సాయంత్రం ఇఫ్తార్ అనంతరం నుంచి అర్ధరాత్రి దాకా హరీస్ సెంటర్ల వద్ద సందడి నెలకొంటుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వందలాది సంఖ్యలో హరీస్, హలీమ్ స్టాళ్లు వెలవగా.. ఒక్క మహబూబ్‌నగర్ నగరంలోనే వంద దాకా కేంద్రాలు ఉన్నాయి. ప్రధాన రహదారులు, జనాలు సందడిగా ఉండే ప్రాంతాలతోపాటు కొన్నిచోట్ల గల్లీల్లోనూ దుకాణాలను ఏర్పాటు చేశారు. సాధారణంగా హలీమ్ (మటన్) రూ.200– 350 (ప్లేట్), హరీస్ (చికెన్) రూ.80– 130 (ప్లేట్), హలీమ్ ఫ్యామిలీ ప్యాక్ రూ.800–1,200, హరీస్ ఫ్యామిలీ ప్యాక్ రూ.400– 600ల వరకు విక్రయిస్తున్నారు.


