● ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వెల్లడి
జడ్చర్ల: ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, సింగిల్, డబుల్ ఫ్యామిలీలకు చెల్లించే ఆర్‌అండ్‌ఆర్ పరిహారాన్ని రూ.18 లక్షలకు ప్రభుత్వం పెంచిందని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పరిహారం పెంపు జీఓను విడుదల చేశారు. గత బీఆర్‌ఎస్ పాలనలో సింగిల్ ఫ్యామిలీకి రూ.6.50 లక్షలు, డబుల్ ఫ్యామిలీకి రూ.16.30 లక్షలు ఉండగా.. తాము సింగిల్, డబుల్ ఫ్యామిలీలకు సమానంగా రూ.18 లక్షలకు పెంచినట్లు వివరించారు. ఇప్పటికే పరిహారం అందుకున్న వల్లూరు, తదితర తండాలకు సంబంధించిన కుటుంబాలకు సైతం ఈ పెంపును వర్తింపజేస్తామన్నారు. అవార్డు పాసైన తర్వాత పరిహారాన్ని పెంచిన దాఖలాలు ఎక్కడా లేవని, ఇక్కడ స్పెషల్ కేసుగా పరిగణించి పరిహారం పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. వచ్చే రెండు నెలల్లో అదనంగా పెంచిన రూ.146 కోట్లతో కలిపి మొత్తం రూ.374 కోట్ల పరిహారం అందజేస్తామన్నారు. అలాగే భూ పరిహారం పెంపు కోసం కోర్టును ఆశ్రయించిన రైతులతో సమావేశం ఏర్పాటు చేసి న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. తాను రైతుల పక్షాన మాట్లాడుతానని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ తరహాలోనే ఉదండాపూర్ నిర్వాసితులకు ప్రభుత్వ ఖర్చులతో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయిస్తామన్నారు. ఉదండాపూర్ ప్రాజెక్ట్ పనులకు కొందరు అడ్డు తగులుతున్నారని, భూ పరిహారం తీసుకుని కూడా దౌర్జన్యంగా పనులు అడ్డుకునే ప్రయత్నం చేయడం తగదన్నారు. ఇలా చేస్తే నిర్ణీత కాలంలో ప్రాజెక్ట్ పూర్తి చేయలేమన్నారు. పనులు అడ్డుకునే వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పుష్పలత, నాయకులు శివకుమార్, అశోక్‌యాదవ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


