మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: చదువుకోవాలని ఆసక్తి ఉన్నా.. ఆర్థిక పరిస్థితులు, పేదరికం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సాయంత్రం వేళల్లో విద్యార్థులు చదువుకునే విధంగా అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. పాలిటెక్నిక్, కనీసం సంవత్సరం ఉద్యోగ అనుభవం ఉన్నవారు బీటెక్ కోర్సుల్లో చేరవచ్చు. వీటితోపాటు బీటెక్ చేసినవారు ఎంటెక్ కోర్సుల్లో కూడా ప్రవేశం పొందవచ్చు. ఇందులో చేరిన వారికి సాయంత్రం వేళల్లో కళాశాలల్లో తరగతులు నిర్వహిస్తారు. ఫీజులు మాత్రం రెగ్యులర్ ఫీజులకు సమానంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు తీసుకోనున్నారు. కాగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క జయప్రకాష్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలకు మాత్రమే సాయంత్రం వేళల్లో కోర్సుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో 60 సీట్లు, సివిల్ ఇంజినీరింగ్‌లో 30, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో 30, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో 30, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 30 సీట్లు ఉన్నాయి. ఈ మేరకు కళాశాలకు సాయంత్రం వేళల్లో తరగుతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో కళాశాల చైర్మన్ రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో కేవలం జేపీఎన్‌సీకి అవకాశం ప్రభుత్వం ఇవ్వడం గొప్ప విషయం అని, ఇక్కడ పనిచేస్తూ చదువుకుంటున్న విద్యార్థులకు సదావకాశం అని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
సాయంత్రం తరగతులు నిర్వహించేలా అవకాశం
ఐదు కోర్సులకు గాను 180 సీట్ల కేటాయింపు
ఉత్తర్వులు జారీచేసిన ఉన్నత విద్యామండలి


