జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో మత్తు పదార్థాలు, డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టి, డ్రగ్స్, మత్తు పదార్థాల వ్యసనాల నుంచి విద్యార్థులు, యువతను కాపాడేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించేందుకు శాఖల వారీగా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఆమె సూచించారు. ప్రత్యేకంగా విద్య, వైద్యం, పోలీసు, మహిళాశిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ప్రతినెలా కనీసం ఐదు పాఠశాలల్లో మత్తు పదార్థాల వ్యసనం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలన్నారు. అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించి, పోలీసు శాఖ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ అందించి అవసరమైతే పునరావాస కేంద్రాలకు పంపాలన్నారు. ఈ సందర్భంగా గంజాయి సహా ఇతర హానికర మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు వాహనాల తనిఖీలు, నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని పోలీసు, ఎకై ్సజ్ శాఖ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ప్రతి పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి తరగతి నుంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి వారి ద్వారా పాఠశాలలో మత్తు పదార్థాల వ్యసనం, దుష్ప్రభావాలపై ఇతర విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, ఏఎస్పీ రత్నం, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి జరీనాబేగం, సీఐ గాంధీనాయక్, సీఎంఓ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల
నివారణకు పటిష్ట చర్యలు
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. రహదారి భద్రతా కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఎన్‌హెచ్–44, 167లపై గుర్తించిన 25 బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, బారీకేడ్ల ఏర్పాటు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్నిచోట్ల 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ వద్ద కొంతమంది బాలురు బైక్‌లపై వచ్చి విద్యార్థినులను వేధిస్తున్నారనే ఫిర్యాదు అందిందని, దీనిపై షీటీంను నియమించి పాఠశాలల వద్ద నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముఖ్య కూడళ్ల వద్ద కొత్త ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు విషయమై ట్రాఫిక్ పోలీసులు అడగగా మున్సిపల్ అధికారులు సమాధానం ఇస్తూ, టెండర్లు పూర్తయినందున వచ్చే వారంలో 10–15 కొత్త ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌కు తెలిపారు.


