మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పూర్తయిన పనులకు సంబంధించి జనరల్ ఫండ్ లేదా 15వ ఆర్థిక సంఘం నుంచి బిల్లులు చెల్లించాలంటే కార్యాలయంలో పర్సంటేజీలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని కాంట్రాక్టర్లు బాహాటంగా చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఓ సీనియర్ అకౌంటెంట్ కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సుమారు పదేళ్లుగా సదరు ఉద్యోగి ఇక్కడే పనిచేస్తూ పై అధికారుల పేర్లు చెప్పి ఏకంగా 5 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. కాగా.. 2024–25లో సుమారు 360 పనులకు అప్పటి పాలకవర్గం (కౌన్సిల్) నుంచి ఇంజినీరింగ్ అధికారులు ఆమోదం తీసుకున్నారు. అదే ఏడాది సుమారు 300 పనులకు, 2025– 26 (ప్రత్యేకాధికారి పాలన)లో మిగిలిన 60 పనులకు టెండర్లు పిలిచారు. వీటిలో ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తి కాగా.. రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు రూ.15–20 కోట్ల వరకు జనరల్ ఫండ్, 15వ ఆర్థిక సంఘం నుంచి చెల్లించారు. ఇంకా రూ.40 కోట్లు పైబడి ఇవ్వాల్సి ఉంది. వాస్తవానికి ఏటా మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్‌కు రూ.30 కోట్ల ఆదాయం దాటడం లేదు. ఈ క్రమంలోనే తమకు కావాల్సిన వారికి మాత్రమే అధికారులు బిల్లులు చెల్లిస్తున్నారని, కమీషన్ ఇవ్వని వారికి చెక్కులు ఇవ్వడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఈ రెండేళ్లలో ముడా ఆధ్వర్యంలో రూ.30 కోట్లకు పైబడి విలువజేసే వివిధ పనులు చేపట్టారు. వీటి బిల్లుల చెల్లింపుల్లోనూ పర్సంటేజీల బాగోతం నడుస్తోందని వారు పేర్కొన్నారు. ఇక్కడ కూడా సదరు సీనియర్ అటౌంటెంటే కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇటీవల సీడీఎంఏ టీకే శ్రీదేవికి నేరుగా కొందరు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు. ఆమె ఆదేశాల మేరకు రీజినల్ డైరెక్టర్ (ఆర్‌డీ) శ్రీనివాసరావు గత నెల 28న మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (ముడా వైస్ చైర్మన్)కు లేఖ పంపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు సీనియర్ అకౌంటెంట్‌పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదించాలని అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా 2024– 25, 2025– 26లలో ఎన్ని పనులు పూర్తయ్యాయి.. ఎన్నింటికి బిల్లులు చెల్లించారు.. ఇంకెన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.. వాటికి గల కారణాలేమిటో వారం రోజుల్లో తెలియజేయాలని కోరినా ఇక్కడి అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం.
● ఈ విషయమై కమిషనర్ పి.రామాంజులరెడ్డిని వివరణ కోరగా ఆర్‌డీ నుంచి తమకు ఇంత వరకు ఎలాంటి లేఖ అందలేదన్నారు. ఒకవేళ వస్తే ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు.
పూర్తయిన పనులకు 5 శాతం వరకు వసూలు
ఇవ్వని కాంట్రాక్టర్లకు చెక్కులు
ఆపేస్తున్న సీనియర్ అకౌంటెంట్
రాష్ట్ర ఉన్నతాధికారులకు బాధిత కాంట్రాక్టర్ల ఫిర్యాదు
పూర్తిస్థాయిలో విచారణకు ఆర్‌డీ శ్రీనివాసరావు ఆదేశం


