భూ సేకరణకు ప్రత్యేక చర్యలు
పాలమూరును..
కృష్ణానదిలో మన వాటా నీటిలో బొట్టు కూడా వదిలిపెట్టం
● రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
● సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశం
● హాజరైన ఉమ్మడి జిల్లాలోని
మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వచ్చే 20 నెలల్లో పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి పాలమూరులోని ముఖ్యమైన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించగా.. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిలసాగర్ ప్రాజెక్టుల పనులను 2027 మార్చి నాటికి పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణకు కృష్ణానదిలో ఉన్న హక్కు మేరకు నీటిని పూర్తిగా వినియోగించుకుంటామని, ఒక్క బొట్టు కూడా వదిలిపెట్టమని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందన్నారు. వచ్చే ఏడాది కాలంలో కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.909 కోట్లు, నెట్టంపాడుకు రూ.252 కోట్లు, భీమాకు రూ.200 కోట్లు, కోయిల్‌సాగర్‌కు రూ.185 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ పనులను మిషన్ మోడ్‌లో పూర్తి చేసేందుకు భూ సేకరణ, పునరావాస చర్యలను వేగవంతం చేస్తున్నామని వివరించారు.
జూరాల ప్రాజెక్టులో డీసిల్టింగ్ పనులను వెంటనే చేపట్టాలని సాగునీటి శాఖ అధికారులకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఆదేశించారు. 1995లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు మొదట 11.94 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకున్నా.. మట్టిపూడిక కారణంగా ప్రస్తుతం 9 టీఎంసీలకు చేరిందన్నారు. డీసిల్టింగ్ ద్వారా తీసే ఇసుకను గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వినియోగించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. ఇటీవల వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో 148.5 లక్షల మె.ట., ధాన్యం ఉత్పత్తి నమోదు కావడం దేశంలోనే రికార్డు అన్నారు. అలాగే సుమారు 72 లక్షల మె.ట., ధాన్యాన్ని కొనుగోలు చేసి.. రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమ చేశామని చెప్పారు. సమావేశంలో ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ శాఖ సెక్రెటరీ ఈ.శ్రీధర్, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల: ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ పరిహారం రూ.338 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్ పరిహారం మొత్తాన్ని రెండు నెలల్లో నిర్వాసితులకు అందజేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు. దీంతోపాటు మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఇచ్చిన తరహాలోనే ఉదండాపూర్ నిర్వాసితులకు కూడా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని కోరామన్నారు. అలాగే ఆర్‌అండ్‌ఆర్ పరిహారాన్ని రూ.16.30 లక్షల నుంచి రూ.18 లక్షలకు పెంచామని, దీంతో నిర్వాసితులకు అదనంగా రూ.148 కోట్లు మొత్తాన్ని చెల్లించేందుకు గతంలోనే ప్రభుత్వం అంగీకరించిందని గుర్తు చేశారు. పెంచిన పరిహారంతో కలిపి మొత్తంగా రూ.338 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. అలాగే భూ పరిహారం పెంపుపై కోర్టును ఆశ్రయించిన రైతులకు కూడా న్యాయం చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కోసం భూ సేకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఈ పనుల కోసం జూన్ 2 నాటికి రూ.5 వేల కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 2014 తర్వాత గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. పాలమూరు– రంగారెడ్డి పథకంలో నీటి ఎత్తిపోతల పాయింట్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల ఖర్చు పెరిగి రాష్ట్రానికి నష్టం వాటిల్లిందన్నారు. అలాగే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌లో తుమ్మిడిహట్టి స్థానంలో మేడిగడ్డను ఎంచుకోవడం కూడా తెలంగాణ రైతులకు శాపంగా మారిందని విమర్శించారు. అన్ని పనులు పారదర్శకంగా, చట్టబద్ధంగా చేపడతామని స్పష్టం చేశారు. కృష్ణానది పరివాహకంలోని రైతులకు సాగునీరు, పంటల ఉత్పత్తి పెరుగుదల, ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కేంద్రిత విధానాలతో ముందుకెళ్తోందన్నారు. తమ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు పాలమూరు ప్రాజెక్టు కోసం రూ.7,161 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇందులో ప్రాజెక్టు పనులకు రూ.6,718 కోట్లు, భూ సేకరణకు రూ.284.71 కోట్లు, పునరావాసానికి రూ.63.65 కోట్లు, ఇతర పనులకు రూ.94 కోట్లు వెచ్చించామన్నారు.


