24 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ప్రసిద్ధి
త్వరలోనే ట్యాగ్ వస్తోంది..
● వన్నెకు తగ్గని విలువ..
మన్నికకు మారు పేరు
● ఇక్కడి బులియన్ మర్చంట్ అసోసియేషన్‌కు 130 ఏళ్ల చరిత్ర
● త్వరలోనే భౌగోళిక గుర్తింపు
వచ్చే అవకాశం
●
నారాయణపేట: పేట అంటేనే చేనేత చీరలు, బంగారానికి ప్రసిద్ధి. మగువ మనసుదోచే అద్భుతమైన బంగారు ఆభరణాల మన్నికకు మారు పేరుగా.. నగల నాణ్యతలో సోనేకా థేట్– నారాయణపేట్ అని తెలంగాణలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. త్వరలోనే భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్) రానుంది. ఇక్కడి బులియన్ మర్చంట్ అసోసియేషన్‌కు 130 ఏళ్ల చరిత్ర ఉంది. స్వర్ణకారులు 24 క్యారెట్ల బంగారంతో సన్నని ధారాలు తీసి.. నగలు తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం జనం బంగారం కొనడానికి వస్తుంటారు. ఏటా దాదాపు రూ.వెయ్యి కోట్ల టర్నోవర్ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
పెళ్లిళ్ల సీజన్‌లో కళకళ..
పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. సరాఫ్ బజార్ కళకళలాడుతుంది. శుభకార్యలు, పండుగలు ఉన్నప్పుడు పేట బంగరాన్ని కొనుగోలు చేసేందుకు కర్ణాటకలోని రాయచూర్, యాద్గీర్, సేడం, గుల్బర్గ, బీదర్, మహారాష్ట్రలోని పుణె, షోలాపూర్, హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావాసులు ఎక్కువగా వస్తుంటారు.
ఆకట్టుకునేలా డిజైన్లు..
స్థానికంగా జువెల్లర్స్ దుకాణాల్లో తయారు చేసిన ఆభరణాలపై చిన్నసైజులో తమ దుకాణం పేరు ముద్ర (మోనోగ్రామ్) వేస్తారు. తిరిగి ఆయా దుకాణాల్లో కొనుగోలుచేసిన వారు విక్రయించేందుకు వెళ్తే గుర్తుపట్టేందుకు వీలుగా ఉంటుంది. వివిధ రకాల డిజైన్లు వ్యాపారులు అందుబాటులో ఉంచుతారు. తారాపూర్, అమృత్‌సర్, ముంబాయి, మచిలీపట్నంలో డైస్ తయారవుతాయి. మార్కెట్‌లో డైస్ వచ్చిన పదిరోజుల్లో ఆయా కొత్త డిజైన్లు ఇక్కడికి చేరుతాయి. అంతేకాకుండా హాల్‌మార్క్‌తో వివిధ రకాల డిజైన్ నగలను పశ్చిమబెంగాల్ స్వర్ణకారులతో తయారు చేయించి విక్రయిస్తారు. లక్ష్మి నెక్లెస్, లక్ష్మి లాంగ్‌చైన్, లాంగ్ చైన్ తదితర రకాల డిజైన్ల ఆభరణాలు లభిస్తాయి.
నారాయణపేట గోల్డ్ ప్యూరిటీతో 24 క్యారెట్ల బంగారంతో మోడ్రన్ డిజైన్లు తయారుచేసి విక్రయిస్తున్నాం. 130 ఏళ్ల చరిత్ర ఉన్న నారాయణపేట బంగారానికి జీఐ గుర్తింపు కోసం దరఖాస్తు చేశాం. బంగారాన్ని సేవింగ్స్‌గా భావిస్తాం. కొన్న బంగారాన్ని అమ్మితే 98 శాతం రిటర్న్ డబ్బులు వస్తాయి. 150 జ్యువెల్లర్స్, 270 మంది స్వర్ణకారులతో మరో 1,700 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో తయారుచేసే నగలు 24 క్యారెట్‌లతో తయారు చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. కానీ నారాయణపేటలో అది సాధ్యమని నిరూపిస్తున్నాం. అందుకే జీఐ గుర్తింపు వస్తుందని నమ్మకం ఉంది.
– సాకేత్ భట్టడ్, బులియన్ మర్చంట్ అసోసియేషన్ చీఫ్ కోఆర్డినేటర్, నారాయణపేట


