మాగనూర్: యువ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన బచ్చి దేవప్ప(32) శుక్రవారం తన పొలంలో స్టార్టర్‌లో కరెంట్ సమస్య చూస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దేవప్ప రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శనివారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ అర్జున్ తెలిపారు.
తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య
నవాబుపేట: తండ్రి మందలించాడని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని గురుకుంటలో చోటు చేసుకుంది. గురుకుంటకు చెందిన వీరన్న కుమారుడు గణే్‌ష్(21) హోలీ సందర్భంగా యువకులతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో గొడవలు మంచివి కావంటూ తండ్రి వీరన్న కుమారుడిని మందలించగా శుక్రవారం ఇంటి నుంచి బయటికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లాడు. రాత్రి సైతం ఇంటికి రాకపోవడంతో ఆచూకీ కోసం వెతకగా శనివారం వారి వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.
ప్రసవానంతరం బాలింత మృతి
మహబూబ్‌నగర్ క్రైం: జనరల్ ఆస్పత్రిలో ప్రసవం తర్వాత ఓ బాలింత మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. జడ్చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన పావని(21) మొదటి కాన్పు కోసం జనరల్ ఆస్పత్రిలోని గైనిక్ విభాగంలో ఆడ్మిట్ అయ్యింది. శనివారం ఉదయం ప్రసవం తర్వాత గుండెపోటుతో మృతిచెందినట్లు తెలుస్తోంది. గతంలో ఆమెకు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుందని, ప్రసవం తర్వాత పరిస్థితి విషమించి సడన్ స్ట్రోక్ వచ్చి మృతి చెందినట్లు సమాచారం. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని కొంత సమయం కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు.
గడ్డివాములు దగ్ధం
● రూ.3లక్షలు నష్టం
ఉండవెల్లి: మండల కేంద్రంలో గడ్డి వాములకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో అగ్నికి ఆహూతయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. రైతులు ఎర్ర శ్రీరాములు, నాగమద్దిలేటి, మద్దిలేటి, చిన్న రాముడు, పెద్ద రాముడు పశువుల కోసం ఐదు గడ్డివాములు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివాములకు నిప్పుపెట్టారు. మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో స్థానికులు గమనించి అలంపూర్ చౌరస్తాలోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా అదుపులోకి రాకపోవడంతో గద్వాల నుంచి మరో ఫైరింజన్‌ను రప్పించి మంటలను అదుపుజేశారు. అయితే అప్పటికే గడ్డివాములు కాలిబూడిదయ్యాయి. ప్రమాదంలో సుమారు రూ.3 లక్షలు నష్టం సంభవించిందని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. కాలిన గడ్డి వాములను ఎస్‌ఐ శేఖర్ ,సర్పంచు నాగరాజు పరిశీలించారు. అనంతరం ఆర్‌ఐ నాగరాజు, జీపీఓ ఎల్లగౌడు పరిశీలించి పంచనామ తీసుకుని కలెక్టర్‌కు పంపుతామన్నారు.


