1200 ఏళ్ల నాటి చారిత్రక ఆనవాళ్లు | - | Sakshi
Sakshi News home page

1200 ఏళ్ల నాటి చారిత్రక ఆనవాళ్లు

Mar 9 2026 7:11 AM | Updated on Mar 9 2026 7:11 AM

మానవపాడు: మండలంలోని బోరవెల్లిలో చారిత్రక ఆనవాళ్లను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈఓ డా.ఈమని శివనాగిరెడ్డి అన్నారు. శనివారం బోరవెల్లి సర్పంచ్‌ హరిశ్చంద్రారెడ్డి సమాచారంతో గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బోరవెల్లిలో బురుజు దగ్గరరున్న బాదామి చాళుక్యుల(సా.శ.8వ శతాబ్దం) కాలపు చండీ, చాముండి విగ్రహాలు, అక్కడే ఉన్న కందూరి చోళులు (12వ శతాబ్దం) కాలపు గణపతి విగ్రహం, వీరభద్రాలయం పక్కనే ఉన్న కళ్యాణ చాళుక్యుల కాలపు నాగదేవత శిల్పాలు, మరో బురుజు పక్కనున్న కాకతీయుల (13వ శతాబ్దం) కాలపు వీరుల శిల్పాలు పరిశీలించి, వాటి చారిత్రక ప్రాధాన్యతను గ్రామస్తులకు వివరించారు. అనంతరం సర్పంచ్‌ హరిశ్చంద్రారెడ్డి సూచన మేరకు.. గ్రామం మధ్యలో ఉన్న బోరవెల్లి సంస్థానం వారు 17వ శతాబ్దం విజయనగర వాస్తుశైలిలో నిర్మించిన చెన్నకేశవాలయం, గర్భాలయం, అర్థమండపం, మహామండపం, మూడు వైపులా ప్రవేశం మండపాలు, ఆలయ అధిష్టానం గోడలు, కప్పుల పైనున్న విష్ణు దశ అవతరాలు, నాట్యగత్తెలు, కాళీయమర్ధన, బైరవుడు, వెంకటేశ్వరస్వామి విగ్రహాలు, ఇంకా ఏనుగులు, సింహాలు, యాలి శిల్పాలు 17వ శతాబ్దం శిల్పశైలిలో ఉన్నాయన్నారు. వీరభద్రుని గుడికి కొంచెం దూరంలో దిగుడు బావి, నిజాం నవాబులు చుట్టూ నిర్మించిన కందకంతో ఉన్న కోటగోడ, బురుజులు అసఫ్‌ జాహివాస్తు శైలిలో ఉన్నాయని, రెండు ఫిరంగులు ఆలనాటి రక్షణ వ్యవస్థను తెలియజేస్తున్నాయని తెలిపారు. దాదాపు 1200 ఏళ్ల వారసత్వానికి అద్దం పడుతున్న బోరవెల్లి చారిత్రక ఆనవాళ్లను కాపాడి భవిష్యత్‌ తరాలకు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో గిరిధర్‌రెడ్డి, అఖిలభారత పాత ఆలయాలు పునరుద్ధరణ ట్రస్ట్‌ అధ్యక్షుడు ఆర్కే జైన్‌, తెలంగాణ ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌ ఎండీ శ్రీనివాస్‌బండ, బోరవెల్లి నాయకులు శేషిరెడ్డి, ఎల్లారెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

పురావస్తు పరిశోధకుడు

ఈమని శివనాగిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement