సూచనలు, సలహాలు, అభ్యంతరాలు స్వీకరిస్తాం | - | Sakshi
Sakshi News home page

సూచనలు, సలహాలు, అభ్యంతరాలు స్వీకరిస్తాం

Mar 9 2026 7:11 AM | Updated on Mar 9 2026 7:11 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: వేగంగా విస్తరిస్తున్న నగరానికి కొత్తగా మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదా సిద్ధమైందని డీటీసీపీ జాయింట్‌ డైరెక్టర్‌ అశ్విని అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ముడా కార్యాలయంలో ప్రత్యేక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 2010 నాటి మాస్టర్‌ ప్లానే అమలులో ఉందన్నారు. అప్పట్లో 32.27 చదరపు కిలోమీటర్ల పరిధి మాత్రమే ఉండేదన్నారు. ఈ క్రమంలోనే నగరం నలువైపులా విస్తరిస్తున్నందున 2019 నుంచి 2021 వరకు కొత్త మాస్టర్‌ ప్లాన్‌ కోసం క్షేత్రస్థాయిలో సర్వే చేయించామన్నారు. దీనికి సంబంధించి 2022లో అప్పటి అడిషనల్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో వర్క్‌షాపు నిర్వహించామన్నారు. ఇప్పటికే నగరంలో ఏనుగొండ నుంచి క్రిస్టియన్‌పల్లి వరకు బైపాస్‌ అందుబాటులోకి వచ్చిందన్నారు. అలాగే అక్కడి నుంచి పీయూ పక్క నుంచి చిన్నదర్‌పల్లి వరకు బైపాస్‌ పొడిగింపు త్వరలోనే పూర్తి కానుందన్నారు. దీంతోపాటు అప్పన్నపల్లి నుంచి చిన్నదర్‌పల్లి వరకు 150 ఫీట్ల వెడల్పుతో కొత్తగా మరో బైపాస్‌ కోసం ఇటీవలే ప్రాథమిక స్థాయిలో సర్వే జరిగిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ రంగాల్లో నగరం అభివృద్ధి చెందుతున్నందున 2041 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాజాగా 108.63 చదరపు కిలోమీటర్ల పరిధిలో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాను తయారు చేయించామన్నారు. దీనికి ఉత్తరం దిక్కులో కొత్తపేట నుంచి వల్లూరు వరకు, తూర్పు దిక్కులో శంకరయ్యపల్లి నుంచి కొత్తతండా వరకు, దక్షిణం దిక్కులో మల్లెబోయినిపల్లి నుంచి తాటికొండ వరకు, పడమర దిక్కులో అల్లీపూర్‌ నుంచి వెంకటాపూర్‌ వరకు సరిహద్దులను నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి సూచనలు, సలహాలు, ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామన్నారు. వీటిని మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పి.రామాంజులరెడ్డికి పంపించవచ్చన్నారు. దీనికోసం త్వరలోనే నోటిఫికేషన్‌ వేస్తామన్నారు. ఇప్పటినుంచి 90 రోజులలోగా లేదా ఈ ఏడాది జూన్‌ 5వ తేదీ నాటికి ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ముందుగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రొజెక్టర్‌ ద్వారా ఆమె వివరించారు. అనంతరం ఈ ముసాయిదాకు ముడా పాలకవర్గం ఆమోదం తెలిపింది. సమావేశంలో మహబూబ్‌నగర్‌, దేవరకద్ర ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ముడా చైర్మన్‌ కె.లక్ష్మణ్‌ యాదవ్‌, నగర మేయర్‌ జి.మమత, ఎం.సురేందర్‌రెడ్డి, భూత్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ బాలకోటి, ముడా సీపీఓ శేఖర్‌, ఏసీపీలు కరుణాకర్‌గౌడ్‌, జ్యోత్స్నాదేవి తదితరులు పాల్గొన్నారు.

కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదా సిద్ధం

డీటీసీపీ జాయింట్‌ డైరెక్టర్‌ అశ్విని

ముడా కమిటీ ప్రత్యేక సమావేశంలో వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement