● అదనపు కలెక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో పర్యావరణ పబ్లిక్ హియరింగ్
● ప్రత్యక్ష, పరోక్ష, మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేసిన మోతీఘనపూర్ వాసులు
రాజాపూర్(బాలానగర్): మండలంలో ఏర్పాటు చేసే పరిశ్రమలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, జన, జీవరాసులకు కాలుష్యకారకం కాకుండా ఉండడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మోతీఘనపూర్ గ్రామస్తులు పేర్కొన్నారు. శనివారం బాలానగర్ మండలం మోతీఘనపూర్ శివారులో అడిషనల్ కలెక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో దివ్యసాయి బోర్డ్స్ ప్రైవేట్ లిమిటేడ్ పరిశ్రమ ఏర్పాటుపై పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నా వాటిలో నిబంధనలు పాటించడంలేదని.. కనీసం గ్రీనరీ మేయిన్‌టేన్ చేయాలనే కచ్చితమైన నిబంధనలున్నా.. అవేవి పరిశ్రమల యాజమాన్యాలు పాటించడంలేదని వివరించారు. ముఖ్యంగా తమ గ్రామశివారులో ప్రస్తుతమున్న పరిశ్రమలు నిబంధనలు గాలికొదిలి జల, వాయు కాలుష్యాలను రైతుల పొలాల్లోకి వదులుతున్నారని.. దానిమూలంగా రైతులు పంటలు పండక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా స్థానికులకు ఉద్యోగావకాశాలు ఇవ్వడమే కాకుండా సీఎస్‌ఆర్ నిధుల ద్వారా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కొందరు ఎన్‌జీఓలు అభిప్రాయపడ్డారు. పబ్లిక్ హియరింగ్‌లో 41మంది ప్రత్యక్షంగా తమ అభిప్రాయాలను తెలిపారని, 44మంది లఖిత పూర్వకంగా వినతులు ఇచ్చారని, మరికొందరు మేయిల్స్ ద్వారా చేసిన ఫిర్యాదులను పరిశీలించి నివేదికను అందజేనున్నట్లు పీసీబీ ఈఈ సురేశ్ పేర్కొన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల రూరల్‌సీఐ నాగార్జునగౌడ్, టౌన్ సీఐ కమలాకర్, బాలానగర్ ఎస్‌ఐ లెనిన్‌గౌడ్ అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.


