డ్రంకెన్‌డ్రైవ్‌లో న్యాయవాదుల రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

డ్రంకెన్‌డ్రైవ్‌లో న్యాయవాదుల రిమాండ్‌

Mar 9 2026 7:11 AM | Updated on Mar 9 2026 7:11 AM

కల్వకుర్తి టౌన్‌: వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించటమే కాకుండా, వారిపై చేయిచేసుకున్న ఇద్దరు న్యాయవాదులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కల్వకుర్తి డీఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపారు. రిమాండ్‌కు సంబంధించి డీఎస్పీ శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన పృథ్వి సుప్రీం కోర్టు, అంకంరావు హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్నారు. వీరితోపాటు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బల్మూర్‌ మండలంలోని జిన్‌కుంటకు శుభకార్యానికి శుక్రవారం వచ్చారు. రాత్రి 8గంటలకు సుభాష్‌నగర్‌లోని గచ్చుబావి వద్ద నారాయణమూర్తి ఇంటి వద్ద మద్యంతాగి ఇంటిపైకి మద్యం సీసాలను విసిరేసి ఇంటి యజమానితో గొడవ పడ్డారు. శనివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో కారులో ఎక్కువ శబ్దంతో పాటలు పెట్టుకొని వెళ్తుండగా.. హైదరాబాద్‌ చౌరస్తాలో పెట్రోలింగ్‌లో ఉన్న ఎస్‌ఐ రాజశేఖర్‌ కారును ఆపగా.. విధుల్లో ఉన్న పోలీసులపై అసభ్య పదజాలంతోపాటు, విధులకు ఆటంకం కలిగించారు. పోలీసులు వారి రక్తనమూనాలు సేకరించి, బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్ష చేయగా మద్యం తాగినట్లుగా నిర్ధారణ అయింది. మద్యం మత్తులో పోలీసులపై దాడి చేయడానికి వెళ్లిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. పోలీస్‌స్టేషన్‌కు తరలించగా.. స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిపైన అసభ్య పదజాలంతో దూషించారు. పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ రామకృష్ణ, నారాయణమూర్తి ఫిర్యాదుతో ఇద్దరిపై రెండు కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్దనుంచి కారును స్వాధీన పర్చుకొని, కల్వకుర్తి సీనియర్‌ సివిల్‌ కోర్టులో హాజరుపర్చగా వారికి జడ్జి రిమాండ్‌ విధించారు. కల్వకుర్తి సీఐ నాగార్జున, ఎస్‌ఐ మాధవరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement