బాలబ్రహ్మేశ్వరుడికి నీరాజనం
అలంపూర్: దక్షిణకాశీ అలంపూర్ క్షేత్రం జనసంద్రంగా మారింది. ఉత్తరవాహిని తుంగభద్ర నదీ తీరాన వెలసిన అలంపూర్ క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. వేలాది మంది భక్తులు శ్రీబాలబ్రహ్మేశ్వరస్వామి, శ్రీజోగుళాంబ అమ్మవార్లను దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి లింగోద్భావాన కాలం వరకు భక్తుల అభిషేకాలతో బ్రహ్మేశ్వరస్వామి ఆలయం కిక్కిరిసింది. యాగశాలలో నిత్యహోమాలలో భాగమైన రుద్రహోమాలతోపాటు ఆవాహిత హోమాలు, త్రికాల సమయాలలో ఆలయం చుట్టూ బలిహరణలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు చేయడానికి భక్తులు బారులుతీరారు. పాపనాశిని, సంగమేశ్వర ఆలయాలను భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జోగుళాంబ గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అలాగే పలువురు ప్రముఖులు ఆలయాలను దర్శించుకున్నారు.
జాగరణకు ప్రత్యేక ఏర్పాట్లు..
మహాశివరాత్రిని పురస్కరించుకొని బాలబ్రహ్మేశ్వర, జోగుళాంబదేవి ఆలయం భక్తజనసంద్రంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా పుష్కర ఘాట్‌లో స్నానాలు ఆచరించారు. అనంతరం స్వామి, అమ్మవారి ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లలో బారులుదీరి.. గంటల తరబడి నిరీక్షించారు. ఈ క్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మజ్జిగ, నీళ్ల బాటిల్స్, ప్రసాదం, అల్పాహారాలు, పండ్లు అందజేశారు. అలంపూర్ క్షేత్రంలో మహాశివరాత్రి జాగరణకు భక్తులు భారీగా తరలివచ్చారు. జాగరణకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాత్రి మొత్తం భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అలంపూర్‌లో పుష్కర ఘాట్‌లో మహాశివుడి విగ్రహానికి
ప్రణమిల్లుతున్న భక్తులు
అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
అలంపూర్ క్షేత్రానికి
భారీగా తరలొచ్చిన భక్తులు
స్వామి, జోగుళాంబదేవిలకుప్రత్యేక పూజలు
తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగిన అభిషేకాలు
కిక్కిరిసిన రహదారులు..
అలంపూర్ క్షేత్ర రహదారులు మహాశివరాత్రి పర్వదినాన భక్తుల రాకపోకలతో కిక్కిరిశాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో క్షేత్రానికి చేరుకున్నారు. ఉదయం సాధారణంగా కనిపించిన భక్తుల రద్దీ.. ఆ తర్వాత గంట గంటకూ భారీ స్థాయిలో పెరిగింది. దీంతో అలంపూర్ చౌరస్తా నుంచి వాహనాలు బారులుదీరాయి. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని పోలీసులు భక్తుల వాహనాలను పట్టణ ముఖద్వారం వద్దనే నిలిపివేశారు. ఫోర్ వీలర్స్, త్రీ వీలర్స్, ట్రావెల్స్ బస్సులను కోర్టు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నిలిపివేశారు. దీంతో భక్తులు అక్కడి నుంచి ఆలయాల వరకు కాలినడకన చేరుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులను ఉచిత ఆటోల ద్వారా తరలించారు.
బాలబ్రహ్మేశ్వరుడికి నీరాజనం
బాలబ్రహ్మేశ్వరుడికి నీరాజనం
బాలబ్రహ్మేశ్వరుడికి నీరాజనం


