వైభవంగా భౌరమ్మ, మల్లన్న లగ్గం
● బౌరపూర్‌లో భ్రమరాంబిక, మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం
● కల్యాణానికి భారీగా తరలి వచ్చిన చెంచులు
● పెళ్లిపెద్దలుగా ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ దంపతులు
అచ్చంపేట: లింగాల మండలం అప్పాపూర్ జీపీ పరిధిలోని బౌరాపూర్ చెంచుపెంటలోని భ్రమరాంబిక ఆలయంలో బౌరమ్మ, మల్లికార్జున స్వామివార్ల కల్యాణం చెంచులు వైభవంగా నిర్వహించారు. ఏటా మహాశివరాత్రి పర్వదినాన బౌరమ్మను తమ అడబిడ్డగా, మల్లికార్జునస్వామిని అల్లుడిగా భావించి చెంచులు స్వామివారికి కల్యాణం జరిపిస్తారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి చెంచులు భారీగా తరలివచ్చారు. గిరిజన సంక్షేమశాఖ, ఐటీడీఏ ఆధ్వర్యంలో వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది. చెంచులు తమ సంప్రదాయ నృత్యాలతో బౌరమ్మ, మల్లికార్జున స్వామివార్లకు ఎదుర్కోళ్లు నిర్వహించారు. దేవతామూర్తల విగ్రహాలను కొప్పెరలో ఉంచి డప్పుచప్పుళ్లతో ఆలయ సన్నిధికి తీసుకొచ్చారు. చెంచుపూజారి మల్లయ్య కల్యాణాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ, అనురాధ దంపతులు స్వామివారి తరఫున వ్యవహరించగా, అమ్మవారి తరఫున పెళ్లిపెద్దలుగా డిప్యూటీ కలెక్టర్ అమరేందర్ దంపతులు వ్యవహరించారు.
పకడ్బందీ ఏర్పాట్లు
బౌరాపూర్ ఉత్సవాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నల్లమల అడవిలో తరచుగా సంభవిస్తున్న అగ్నిప్రమాదాలను దృషిలో ఉంచుకుని అధికారులు పైర్‌ఇంజన్ల అందుబాటులో ఉంచారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐలు నాగరాజు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అర్టికల్చర్, జీసీసీ, ఆర్డీటీ, వైద్యారోగ్యశాఖ, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఐటీడీఏ, ఆర్‌డబ్ల్యూఎస్‌కు సంబంధించిన ప్రభుత్వ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఐటీడీఏ అధికారులు వివిధ ప్రాంతాల నుంచి చెంచులను తరిలించేందుకు ప్రత్యేకంగా 14 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడంతో చెంచులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూలు ఎంపీ మల్లురవి, కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా వైద్యాధికారి రవికుమార్, డీటీడీఓ ఫిరంగి, ఆర్డీఓ యాదగిరి, ఐటీడీఏ అధికారి జాఫర్ ఉస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
4కిమీ వరకు ట్రాఫిక్ జామ్
బౌరాపూర్ భ్రమరాంబ ఆలయంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. వాహనాల రద్దీతో సుమారు 4కి.మీ వరకు ట్రాఫిక్ జామ్ అయి వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌లో ఎంపీ మల్లు రవి వాహనం కదలేని పరిస్థితి ఏర్పడటంతో చివరకు ఆయన బైక్‌పై ఆలయానికి చేరుకున్నారు.
స్వామివారిని ఎదుర్కోలకు తీసుకొస్తున్న ఎమ్మెల్యే దంపతులు
తాగునీటి సౌకర్యం కల్పించాలి
చెంచుపెంటల్లో తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రతి చెంచుపెంటలో ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అప్పాపూర్ సర్పంచ్ శివమ్మ కోరారు. ప్రతి చెంచు కుటుంబానికి జీవనోపాధి కల్పించాలని, ప్రత్యేక ఉపాధిహామీ చట్టం అమలు చేయాలని కోరారు. ఐటీడీఏ రెగ్యూలర్ పీఓ నియమించాలని, పీసా చట్టం పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. అటవీ హక్కుల చట్టాన్ని ఉమ్మడిగా అమలు చేస్తూ, గతంలో అడవిలో కొంత చెంచులకు కేటాయించిన భూమిని తిరిగి అప్పగించాలని కోరారు.
వైభవంగా భౌరమ్మ, మల్లన్న లగ్గం


