దేవుడి సొమ్ముపై తేలని ‘అవినీతి’ లెక్క | - | Sakshi
Sakshi News home page

దేవుడి సొమ్ముపై తేలని ‘అవినీతి’ లెక్క

Feb 15 2026 12:26 PM | Updated on Feb 15 2026 12:26 PM

దేవుడ

దేవుడి సొమ్ముపై తేలని ‘అవినీతి’ లెక్క

దేవదాయశాఖ కమిషనర్‌కుఫిర్యాదు చేయాలని నిర్ణయం

శివరాత్రి తర్వాత టెండర్ల ఖరారు

అడ్డాకుల: మండలంలోని కందూర్‌ సమీపంలో వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన దేవుడి సొమ్ము స్వాహాపై శనివారం సాయంత్రం మొదలైన చర్చ రాత్రి వరకు కొనసాగింది. స్వామివారి సొమ్మును పక్కదారి పట్టించిన అంశంపై దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ మదనేశ్వర్‌రెడ్డి సమక్షంలో గ్రామస్తులు ఆలయంలో శనివారం చర్చించారు. దేవుడి సొమ్ముకు సంబంధించిన నిధుల లెక్క తేల్చాలని గ్రామస్తులు పట్టుబట్టారు. టెండరుదారుడు మురళిని గ్రామస్తుల సమక్షంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ విచారించారు. ఎప్పుడెప్పుడు డబ్బులు ఇచ్చారని, డబ్బులు ఇచ్చినప్పుడు రసీదులు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తర్వాత అక్కడికి చేరుకున్న ఈఓ రాజేశ్వరశర్మపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు పక్కదారి పట్టించిన విషయంపై లెక్క చూపాలని నిలదీశారు. దీనికి ఈఓ సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో అధికారులు, గ్రామస్తుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. చివరివరకు అవినీతి లెక్క తేలకపోవడంతో దీనిపై దేవదాయశాఖ కమిషనర్‌, కలెక్టర్‌, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. శివరాత్రి ఉత్సవాలు జరిగిన తర్వాత బ్రహోత్సవాల టెండర్ల నిర్వాహణపై నిర్ణయం తీసుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం కొత్తగా ఎవరికీ ఆలయం ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వవద్దని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ మదనేశ్వర్‌రెడ్డినే స్వామివారి బ్రహోత్సవాలు ముగిసే వరకు ఇన్‌చార్జిగా ఉండాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయం మేరకు తాను పనిచేస్తానని ఆయన బదులిచ్చారు. మొత్తంగా ఆలయంలో స్వామివారి నిధుల గోల్‌మాల్‌కు సంబంధించిన వ్యవహారంపై రాత్రి వరకు జరిగిన చర్చలో ఎలాంటి క్లారిటీ రాలేదు. నిధుల స్వాహాపై ఫిర్యాదు చేయాలని మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. దేవుడి సొమ్ము స్వాహా చేసినదానిపై లెక్క తేల్చడానికి అధికారులు ఇంకా మీనమేశాలు లెక్కించడం విమర్శలకు దారి తీస్తోంది. ఇదిలా ఉండగా దేవుడికి దాతలు ఇచ్చిన వెండి వస్తువులను కూడా మాయం చేశారేమోనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో లాకర్‌లో ఉన్న వెండి వస్తువులను అధికారులు తీసుకొచ్చి గ్రామస్తులకు చూపించారు.

దేవుడి సొమ్ముపై తేలని ‘అవినీతి’ లెక్క 1
1/1

దేవుడి సొమ్ముపై తేలని ‘అవినీతి’ లెక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement