కోర్టుకు వెళ్తా
కల్వకుర్తి టౌన్: ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు నానాపాట్లు పడుతుంటారు. కొందరు సునాయాసంగా గెలిస్తే మరికొందరు నానా తిప్పలు పడాల్సి వస్తుంది. దీనికి తోడు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని పలువురు అంటుంటారు. అలాంటి పరిస్థితే ఏర్పడింది మున్సిపల్ ఎన్నికలలో. పట్టణంలోని పదో వార్డులో కాంగ్రెస్ తరఫున ఎజాస్, బీఆర్‌ఎస్ తరఫున తాహిర్‌అలీ పోటీ చేశారు. కౌంటింగ్‌లో మొదటగా కాంగ్రెస్ అభ్యర్థికి 259 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్ అభ్యర్థికి 257 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి రెండు ఓట్ల మెజార్టీ వచ్చింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి రీకౌంటింగ్ చేయాలని కోరడంతో అధికారులు కౌంటింగ్ చేశారు. రీకౌంటింగ్‌లో బండిల్‌లో ఓ బ్యాలెట్ పేపర్ కట్టలో ఉండే 25 పేపర్ల కన్నా ఒకటి ఎక్కువగా కట్టడంతో బీఆర్‌ఎస్ అభ్యర్థికి ఆ ఓటును అధికారులు కలిపారు. దీంతో బీఆర్‌ఎస్ అభ్యర్థికి 258 ఓట్లు వచ్చినట్లుగా అధికారులు ప్రకటించారు. మరల రీకౌంటింగ్‌కు బీఆర్‌ఎస్ అభ్యర్థి కోరగా ఇన్వాలిడ్‌గా ఉన్న ఒక్క ఓటు మిగిలిపోయింది. దీంతో అధికారులు ఆ ఇన్వాలిడ్ ఓటులో ఇద్దరి అభ్యర్థుల గుర్తుల దగ్గర ఉన్న ఇంకు సమస్య వచ్చింది. ఇంక్ సమస్య రావటంతో ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణించి, ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్ గెలిచినట్లుగా ధ్రువీకరించి ప్రకటించారు. ఈ వార్డులో పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థికి ఒక్క ఓటు రావడం, ఆ ఒక్క ఓటుతోనే బీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోవడం విశేషం.
రిటర్నింగ్ అధికారులు ఒక్క ఓటును పక్కన పెట్టి దానిని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఎన్నిక ఫలితాన్ని ప్రకటించారని బీఆర్‌ఎస్ అభ్యర్థి తాహిర్‌అలీ ఆరోపించారు. ఎన్నిక ప్రకటనను నా సంతకం లేకుండానే ప్రకటించడాన్ని తప్పు బట్టారు. ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటించవద్దని రిటర్నింగ్ అధికారికి వినతిని అందించేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ఎన్నికపై కోర్టులో పోరాడుతానని, అప్పటివరకు ఎన్నిక ఫలితాన్ని ప్రకటించవద్దని అధికారులను డిమాండ్ చేశారు.


