తేలని టికెట్లు.. తప్పని ‘పరీక్ష’! | - | Sakshi
Sakshi News home page

తేలని టికెట్లు.. తప్పని ‘పరీక్ష’!

Jan 31 2026 10:29 AM | Updated on Jan 31 2026 10:29 AM

తేలని

తేలని టికెట్లు.. తప్పని ‘పరీక్ష’!

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పురపాలక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. అయినా అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడం ఆశావహులకు పరీక్షలా మారింది. మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ) పరిధిలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పూర్తిగా, బీజేపీ పలు డివిజన్లకు అభ్యర్థులను ఇప్పటివరకూ అధికారికంగా వెల్లడించలేదు. ఈ క్రమంలో చివరి రోజు ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు అధిక సంఖ్యలో నామినేషన్‌ కేంద్రాలకు పోటెత్తారు. అనిశ్చితి, ఆందోళనల మధ్యే నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. దాదాపుగా అన్ని పార్టీల్లోనూ అందరూ రెండు సెట్లు (పార్టీ తరఫున, స్వతంత్రంగా) దాఖలు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని దేవరకద్ర, భూత్పూర్‌ మున్సిపాలిటీల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.

భూత్పూర్‌: 10 వార్డులు.. 101 నామినేషన్లు

ఈ మున్సిపాలిటీలో మొత్తం పది వార్డులు ఉన్నాయి. మొత్తం 101 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్‌ నుంచి 29 మంది, బీఆర్‌ఎస్‌ నుంచి 27 మంది, బీజేపీ నుంచి 23 మంది, స్వతంత్రులు 21 మంది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు. మూడు ప్రధాన పార్టీల్లోనూ ఇద్దరికి మించి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఒక్కవార్డుకు కనిష్టంగా ఇద్దరు.. గరిష్టంగా నలుగురు వరకు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నుంచి నామినేషన్లు వేసిన వారిలో పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా సైతం మరో సెట్‌ దాఖలు చేశారు.

వ్యూహాత్మకమేనా..

దేవరకద్ర, భూత్పూర్‌ మున్సిపాలిటీలలో చివరి రోజు నామినేషన్ల కార్యక్రమాన్ని ఆయా రాజకీయ పార్టీలు అట్టహాసంగా నిర్వహించాయి. ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు తమతమ పార్టీల అభ్యర్థులు, శ్రేణులతో కలిసి ర్యాలీ చేపట్టారు. మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు డివిజన్ల పరిధిలో ర్యాలీ చేపట్టారు. రెబల్స్‌ ప్రభావం అధికంగా ఉందని గ్రహించిన ఆయా పార్టీల ముఖ్య నేతలు ర్యాలీలు నిర్వహించినా.. వ్యూహాత్మకంగానే అధికారికంగా కార్పొరేటర్‌/కౌన్సిలర్‌ అభ్యర్థులను ప్రకటించలేదని తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ రోజే బీపాంలు అందజేసే అవకాశం ఉందని సీనియర్‌ రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు వార్డుల వారీగా ఫైనల్‌ అయిన అభ్యర్థులకు ఫోన్‌ చేసి మీ పని మీరు చేసుకోండని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రెబల్‌ అభ్యర్థులను బుజ్జగించేలా ఆయా పార్టీల ముఖ్య నేతలు సంప్రదింపులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

మహబూబ్‌నగర్‌:

60 డివిజన్లు.. 781నామినేషన్లు

కొత్తగా ఆవిర్భవించిన ఈ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. గడువు ముగిసే నాటికి మొత్తంగా 781నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ తరఫున 328, బీఆర్‌ఎస్‌ నుంచి 153, బీజేపీ నుంచి 112, ఎంఐఎం నుంచి 28, జనసేన తరఫున 20, బీఎస్‌పీఎనిమిది డివిజన్లలో, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి ముగ్గురు, ఆప్‌, సీపీఎం నుంచి ఇద్దరేసి చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. మరో 125 మంది స్వతంత్రులు/ఇతరులు నామినేషన్లు దాఖలు చేసిన వారు ఉన్నారు. సగటున ఒక్కో వార్డుకు కనిష్టంగా ముగ్గురు నుంచి గరిష్టంగా పది మంది వరకు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో గరిష్టంగా ఒక్కో డివిజన్‌లో ఆరుగురు, బీఆర్‌ఎస్‌లో గరిష్టంగా ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

దేవరకద్ర: 12 వార్డులు.. 96 నామినేషన్లు

నూతనంగా ఏర్పడిన ఈ పురపాలికలో 12 వార్డులు ఉండగా.. మొత్తం 96 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు ప్రకటించారు. అధికార కాంగ్రెస్‌ కంటే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నుంచి అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడం అభ్యర్థుల మధ్య పోటాపోటీకి నిదర్శనంగా నిలుస్తోంది. కాంగ్రెస్‌ తరఫున 28, బీఆర్‌ఎస్‌ తరఫున 35, బీజేపీ అభ్యర్థులుగా 22 మందితో పాటు స్వతంత్రులుగా 11 మంది నామినేషన్లు వేశారు. సగటున వార్డుకు సుమారు ఎనిమిది మంది చొప్పున.. ప్రధాన పార్టీల్లో కనిష్టంగా ఇద్దరు నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

నామినేషన్ల ఘట్టం ముగిసినా ఖరారు కాని అభ్యర్థిత్వాలు

కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌లోనూ కొనసాగుతున్న అనిశ్చితి

ఎంఎంసీలో చివరి రోజు పోటెత్తిన కార్పొరేటర్‌ అభ్యర్థులు

మొత్తంగా 978.. ఒక్కొక్కరు దాదాపు 2 సెట్లు దాఖలు

రెబల్స్‌ కట్టడికి ప్రధాన పార్టీల వ్యూహాత్మక అడుగులు

సంప్రదింపులు, బుజ్జగింపులకు శ్రీకారం

ఉపసంహరణ రోజే బీఫాంలు..

తేలని టికెట్లు.. తప్పని ‘పరీక్ష’!1
1/2

తేలని టికెట్లు.. తప్పని ‘పరీక్ష’!

తేలని టికెట్లు.. తప్పని ‘పరీక్ష’!2
2/2

తేలని టికెట్లు.. తప్పని ‘పరీక్ష’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement