మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలో మున్సిపల్ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉన్నందున, విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా తమ విధులను నిర్వర్తించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిగా శ్రద్ధగా విని, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర అవగాహన పొందాలని తెలిపారు. ఏవైనా సందేహాలు ఏర్పడితే, ప్రిసైడింగ్ అధికారులకు అందజేసిన కరదీపికను జాగ్రత్తగా అధ్యయనం చేసి, చట్టబద్ధంగా స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఎవరికి కేటాయించిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు సకాలంలో చేరుకొని, ఫారం–12కు సంబంధించిన అన్ని ఎన్నికల సామగ్రిని పూర్తిగా పరిశీలించి, ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా నిర్ధారించుకోవాలని సూచించారు. తమకు కేటాయించిన సిబ్బందిని సమన్వయంతో సమీకరించి, అందరూ కలిసికట్టుగా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, సీఎంఓ సుధాకర్‌రెడ్డి, మాస్టర్ శిక్షకులు బాలు యాదవ్, నాగరాజు, శ్రీకాంత్ పాల్గొన్నారు.
సమావేశంలోమాట్లాడుతున్న కలెక్టర్


