కేసీఆర్‌కు సిట్ నోటీసులివ్వడం ఎన్నికల స్టంట్
● మహబూబ్‌నగర్ మేయర్‌గా బీజేపీకి అవకాశం ఇవ్వండి
● స్పీకర్ సైతం కోర్టులను మోసం చేయడం దారుణం
● రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి గెలవాలని ఎమ్మెల్యే బండ్లకు సవాల్ : ఎంపీ డీకే అరుణ
పాలమూరు: ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం కేవలం మున్సిపల్ ఎన్నికల స్టంట్ మాత్రమేనని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఎంపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రజలను మోసం చేసేందుకు ఏదో ఒకటి తెరపైకి తేవడం అలవాటుగా మారిందని ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తెచ్చారన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యలో ఉన్న అండర్ స్టాండింగ్ పాలిటిక్స్ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం, ఈ–కార్ రేస్ నివేదికలు వచ్చాయి..ఈ రెండేళ్లలో ఏం చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అవగాహన ఒప్పందంలో భాగంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చడానికి సిట్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. చర్యలు తీసుకుంటామని చెప్పే నాటకం తప్పా, చర్యలు తీసుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు. గద్వాల ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌లో ఉన్నాడని స్పీకర్ చెబుతుంటే.. కాంగ్రెస్‌కు ఓటు వేయాలని సదరు ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందాలని సవాల్ విసిరారు. స్పీకర్ సైతం కోర్టులను మోసం చేయడం చూస్తుంటే.. ఇంతకన్నా దారుణం ఇంకా ఏదీ ఉండదన్నారు. ఫిరాయింపులపై రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలన్నారు. మహబూబ్‌నగర్ నగర ప్రజలకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చేసింది ఏమీ లేదని, ఈ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగుర వేయడానికి ప్రజలు సహకరించాలన్నారు. మహబూబ్‌నగర్ మేయర్‌గా బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.


