షికారుతో పాలిట్రిక్స్!
గద్వాలలో కీలక రాజకీయ పరిణామాలు
● బండ్ల, సరిత వర్గ పోరులో మారిన పుర ఎన్నికల ముఖచిత్రం
● కాంగ్రెస్‌లో టికెట్ల నిరాకరణతో సరిత వర్గీయుల నారాజ్
● బీఆర్‌ఎస్ నుంచి పలు వార్డుల్లో పోటీకి రంగం సిద్ధం
● మరికొందరు స్వతంత్రంగా బరిలోకి..
● నామినేషన్ల చివరి రోజు బహిర్గతం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఆధిపత్య, వర్గ రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచిన ఉమ్మడి పాలమూరులోని గద్వాల జిల్లాలో మరోసారి కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పుర ఎన్నికల వేళ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ సరిత మధ్య చోటుచేసుకున్న టికెట్ల లొల్లి కాంగ్రెస్‌లో చిచ్చు రాజుకోగా.. పట్ణణంలో పోరు ముఖచిత్రాన్ని మార్చేసింది. నామినేషన్ల ఘట్టం చివరి రోజు శుక్రవారం అనూహ్యంగా తారుమారు పాలి‘ట్రిక్స్’తెరపైకి రాగా.. ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.
బీఫాంలు ఎవరికో..
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ సరిత మధ్య తొలి నుంచీ ఆధిపత్య లొల్లి కొనసాగుతున్న విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఒకరెనుక ఒకరు కాంగ్రెస్‌లో చేరినా.. వారి మధ్య అగాధం పెరుగుతూనే వచ్చింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సైతం ఇరు వర్గాలు పోటీ పడినప్పటికీ.. పార్టీ గుర్తుపై జరిగేటివి కాకపోవడంతో ఎవరు గెలిచినా కాంగ్రెస్ మద్దతుదారులుగా ముద్రపడ్డారు. కానీ మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగేటివి కావడంతో ప్రస్తుతం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి. అంతేకాదు కొందరు సరిత వర్గీయులు ఇటు కాంగ్రెస్‌తోపాటు అటు బీఆర్‌ఎస్ తరఫున కూడా నామినేషన్లు దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో బీఫాంలు ఎవరికి దక్కుతాయి.. ముఖ్య నేతలు సయోధ్యకు చొరవ తీసుకుంటారా అనేది చర్చనీయాంశమైంది.
అసలు ఏం జరిగిందంటే..
గద్వాల పురపాలికలో మొత్తం 37 వార్డులు ఉన్నాయి. పురపాలికలకు ఎన్నికల కసరత్తు జరుగుతున్న క్రమంలో తన వర్గానికి 20 కేటాయించాలని సరిత అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో పర్యటించిన క్రమంలో కూడా ఆమె ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఆయన ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ఇన్‌చార్జి, మంత్రి వాకిటి శ్రీహరికి సూచించారు. అయితే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇందుకు ససేమిరా అంటూ నిరాకరించినట్లు సమాచారం. అంతేకాదు.. ఒకానొక సందర్భంలో కౌన్సిలర్, పుర పీఠం ఎలా దక్కించుకోవాలో తనకు తెలుసని.. ఆ వర్గానికి ఒక్క టికెట్ కేటాయించినా మీ ఇష్టమని సమాధానమిచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో 20 నుంచి 12.. ఆ తర్వాత పది టికెట్లయినా కేటాయించాలనే ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. చివరకు తన వర్గానికి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులకు టికెట్లు ఖరారు చేయాలని కోరగా.. తనకు వారు నేరుగా ఫోన్ చేస్తే కేటాయిస్తానని చెప్పినట్లు వినికిడి. ఇందులో ఒకరు ఫోన్ చేయగా.. ఆయనకు టికెట్ ఖరారు చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో నామినేషన్ల చివరి రోజు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే భారీ ర్యాలీ నిర్వహించారు. అభ్యర్థులతో నామినేషన్లు వేయించగా.. ఈ కార్యక్రమానికి సరిత, ఆమె వర్గీయులు దూరంగా ఉన్నారు.
బీఆర్‌ఎస్‌తో టచ్‌లోకి.. ఆ వెంటనే..
టికెట్ల నిరాకరణతో నారాజ్‌లో ఉన్న సరిత వర్గీయులు నామినేషన్ల చివరి రోజు కీలక అడుగులు వేశారు. దాదాపు 15 వరకు వార్డుల్లో ఆమె మద్దతుదారులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ తరఫున కాకుండా కొందరు స్వతంత్రంగా, మరికొందరు బీఆర్‌ఎస్ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. మూడు, నాలుగు రోజుల క్రితమే పలువురు బీఆర్‌ఎస్ నేతలతో టచ్‌లోకి వెళ్లడం.. వారి అంగీకారంతోనే పలు వార్డులకు వారు ఆ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు నామినేషన్ల అనంతరం కారెక్కేందుకు వారు రంగం సిద్ధం చేసుకోవడం ముందస్తు స్కెచ్‌లో భాగమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారిని కట్టడి చేయలేక సరిత చేతులెత్తేసిందా.. ఎమ్మెల్యేను ఢీ కొట్టేందుకే తన వ్యూహంలో భాగంగా వారిని ఆ పార్టీలోకి పంపించిందా అనే దానిపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.


