సూర్యప్రభవాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండలో శుక్రవారం రాత్రి శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి సూర్యప్రభవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. శోభాయమానంగా అలంకరించిన సూర్యప్రభవాహనంపై స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తుల హరినామస్మరణ మధ్య స్వామివారి సేవ ముందుకు కదిలింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి సేవను చూసి భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి హనుమత్‌వాహన సేవ, ప్రభోత్సవం నిర్వహిస్తారు.


