అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి
పాలమూరు: మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో మొదటిరోజు నామినేషన్లు స్వీకరించడానికి మొత్తం 20 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో మూడు డివిజన్లకు సంబంధించిన అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకోవడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్, మొదటి ఫ్లోర్‌లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు బుధవారం కలెక్టర్ విజయేందిర, జనరల్ ఎన్నికల పరిశీలకురాలు పి.కాత్యాయినీదేవి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సమయంలో నో డ్యూ సర్టిఫికెట్ కోసం మున్సిపాలిటీలో భవనం లోపల అధిక సంఖ్యలో జనాలు ఉండటంతో పోలీసులతో పాటు కార్పొరేషన్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థితో సహా ముగ్గురికి మాత్రమే అనుమతి కల్పించాలని, నేటి నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లు ఏ ఒక్కటి కూడా కార్పొరేషన్ కార్యాలయం లోపలికి రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోటీలో ఉండే అభ్యర్థులకు అర్థమయ్యే విధంగా నిబంధనలపై కార్పొరేషన్ ఆవరణలో ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నామినేషన్ ఫారాలు, నో డ్యూ సర్టిఫికెట్ కోసం రెండు ప్రత్యేక కౌంటర్లు బయట అందుబాటులో పెట్టాలన్నారు. కార్యాలయం లోపల అనవసరమైన గందరగోళం లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
320 పోలింగ్ స్టేషన్లు..
మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు, దేవరకద్రలో 12, భూత్పూర్‌లో 10 కౌన్సిలర్ వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ రెండు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో కలిపి 320 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేశామని, వీటి పరిధిలో 2.20 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్‌కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ పూర్తి చేశామని, అన్నిచోట్ల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మోడల్ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దానిని పర్యవేక్షించడానికి ఎఫ్‌ఎస్‌టీ, ఫ్లయింగ్‌స్వ్కాడ్, స్టార్టింగ్ సర్వేలైన్స్ బృందాలు ఏర్పాటు చేశామని వీరికి ప్రత్యేక అధికారులు ఉంటాయని తెలిపారు. ఖర్చులపై ప్రత్యేక పరిశీలకులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
నిబంధనలు అర్థమయ్యే విధంగా బ్యానర్లు ఏర్పాటు చేయాలి
కలెక్టర్ విజయేందిర, ఎన్నికల జనరల్ పరిశీలకురాలు కాత్యాయనీదేవి
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు


