బాధ్యతలు స్వీకరించిన కొత్త కమిషనర్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ కొత్త కమిషనర్‌గా రామాంజులరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్ విజయేందిర బోయి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. కాగా, ఈయన రెండురోజుల క్రితమే జీహెచ్‌ఎంసీ పరిధిలోని ముషీరాబాద్ జోన్ నుంచి ఇక్కడికి బదిలీ అయ్యాడు.
రేపు ఉమ్మడి జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో ఈనెల 25వ తేదీన ఉమ్మడి జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో జరిగే హెచ్‌సీఏ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో పాల్గొనే ఉమ్మడి జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారిణులు ఆధార్‌కార్డు, రెండు ఫొటోలతో ఉదయం 10 గంటలకు మైదానంలో రిపోర్టు చేయాలని ఆయన సూచించారు.
నేడు బాలికలకు చట్టాలపై అవగాహన
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా 0 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు బాలిక హక్కుల చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేందిర శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో అన్ని పాఠశాలలు, కళాశాలలో వారి హక్కులు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 121 పోక్సో కేసులు నమోదయ్యాయని తెలిపారు. బాల్య వివాహాలపై పిల్లలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించనున్నట్లు, తనను తాము రక్షించుకునే విధంగా వారికి అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు జిల్లాలో 53 బాల్య వివాహాలను ఆపడం జరిగిందని, జిల్లాలో ఆడపిల్లల లింగ నిష్పత్తిని మెరుగుపరిచేందుకు బేటి బచావో బేటి పడావో కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కళాజాతా కళాకారులతో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. లింగ నిర్ధారణ చేయకుండా డయాగ్నస్టిక్ సెంటర్లను నియంత్రించడంతో పాటు బ్రూణ హత్యలు జరగకుండా ఉక్కుపాదం మోపుతున్నామని హెచ్చరించారు.
కాంగ్రెస్‌లో ఎన్నికల సందడి
ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
స్టేషన్ మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి మొదలైంది. కార్పొరేషన్‌లోని 60 డివిజన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి శుక్రవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. గతంలోనే పది డివిజన్లకు ఇద్దరేసి కోఆర్డినేటర్లను నియమించారు. మొదటగా ఈ నెల 5, 6 తేదీల్లో వ్యక్తిగత వివరాలతో కూడిన దరఖాస్తులు స్వీకరించారు. 60 డివిజన్లకు దాదాపు 376 దరఖాస్తులు వచ్చాయి. రిజర్వేషన్లు ఖరారు కావడంతో తాజాగా డివిజన్ల వారీగా రిజర్వేషన్ ప్రకారం ఆశావహులు టికెట్ల కోసం దరఖాస్తులు అందజేస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు శనివారమే ఆఖరి రోజు కావడంతో నేడు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఆయా డివిజన్లలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి సర్వే నిర్వహించి.. గెలుపు గుర్రాలకు టికెట్ ఇచ్చేందుకు సర్వే నిర్వహించే అవకాశం ఉంది. ఆయా డివిజన్లలో ప్రజలు, కాంగ్రెస్ అభిమానులను కలిసి ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందోనన్న విషయాలను సీనియర్ నాయకులు సేకరించనున్నారని సమాచారం.


