బ్రహ్మాండనాయకా.. లక్ష్మీచెన్నకేశవ
● నేటి నుంచి గంగాపురం జాతర
● లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
జడ్చర్ల టౌన్: తెలంగాణ రాష్ట్రంలోనే పేరుగాంచిన చెన్నకేశస్వామి ఆలయాల్లో ఒకటైన గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ప్రతి ఏటా మాఘశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వైష్ణవ పాంచరాత్రాగమ సాంప్రదాయం మేరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగే ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాలకు ఆలయ పడమర ప్రాంతం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. అదే విధంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొంటారు.
ఏర్పాట్లు పూర్తి..
గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయ శుద్ధి, పెయింటింగ్, ప్రాకారాలు, కోనేరు ఇతర నిర్మాణాలకు జాజు పూయడం వంటి పనులు పూర్తయ్యాయి. ఆలయ ప్రాంగణంలో భక్తులు వంటావార్పు చేసుకునేందుకు గాను చదునుచేసి సిద్ధంగా ఉంచారు. కోనేటిలో భక్తులు స్నానాలు ఆచరించేందుకు పాతనీటిని బయటకు పంపింగ్ చేసి.. కొత్త నీటిని నింపుతున్నారు. ఇక తలనీలాలు, కొబ్బరికాయలు, కొబ్బరిచిప్పల సేకరణ వేలం పూర్తిచేసి వేలందారులకు అప్పగించారు.
కార్యక్రమాలు ఇలా..
మొదటి రోజు సోమవారం స్వామి, అమ్మవార్లకు అష్టోత్తర శత కలశాలతో అభిషేకం, నూతన వస్త్రాలతో అలంకరణతో ఉత్సవాలను ప్రారంభిస్తారు.
20న విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, మృత్సంగ్రహణం, ఉత్సవాలకు అంకురార్పణ, అగ్నిప్రతిష్ట, పల్లకీ సేవ నిర్వహించనున్నారు.
21న ధ్వజారోహణం, ప్రాణప్రతిష్ఠ, బలిహరణం తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయి.
22న ఎదుర్కోలు, స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. 23న శేషవాహన సేవ
24న పుష్పరథం (చిన్నతేరు) 25న పెద్ద తేరు (రథోత్సవం) 26న శకటోత్సవం 27న చక్రతీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయి.
సర్వం సిద్ధం..
ప్రతి ఏటా మాఘమాసంలో నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశాం. రథోత్సవం, శకటోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేశాం. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులను కోరాం. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్యారోగ్యశాఖల సహకారం తీసుకుంటున్నాం. – దీప్తిరెడ్డి, ఈఓ, గంగాపూర్ ఆలయం
బ్రహ్మాండనాయకా.. లక్ష్మీచెన్నకేశవ


