మాగనూర్ చెరువులో మొసలి కలకలం
మాగనూర్: మండలంలోని మాగనూర్ గ్రామ ఊర చెరువులో మొసలి కనిపించడం కలకలం రేపింిది. ఆదివారం మధ్యాహ్నం కొందరు పశువుల కాపారులు చెరువు వద్దకు వెళ్లగా గట్టు మీద సేద తీరుతున్న మొసలి కనిపించడంతో ఒడ్డుకు పరుగులు తీశారు. మాగనూర్ పెద్ద చెరువులో సుమారు పెద్దవి మూడు, చిన్నవి ఐదుకు పైగా మొసళ్లు ఉన్నట్లు పశువుల కాపారులు చెబుతున్నారు. దీంతో చెరువు వైపు వెళ్లాలంటేనే గ్రామస్తులు, పశువుల కాపారులు జంకుతున్నారు. మాగనూర్ పెద్ద చెరువులో ఉన్న మొసలి వలన చేపలు కూడా తగ్గిపోతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మొసళ్లను బంధించి మరో చోటికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


