నమో.. నారసింహ
స్వామివారికి హారతి ఇస్తున్న ఆదిత్య లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, తదితరులు
ఆలయ ఆవరణలో కిక్కిరిసిన భక్తులు
కొల్లాపూర్/ కొల్లాపూర్ రూరల్: నమో.. నారసింహా నామస్మరణతో సింగోటం (సింగపట్నం) పరిసరాలు మార్మోగాయి. లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం వేలాదిగా తరలివచ్చిన భక్త జనసందోహం మధ్య రథోత్సవం ముందుకు కదిలింది. ఆలయ ప్రధాన అర్చకులు ఓరుగంటి సంపత్‌కుమార్‌శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా రఽథోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఉత్సవమూర్తులకు ఆలయంలో పట్టువస్త్రాలు, ఆభరణాలతో అలంకరణ చేసి, మంగళవాయిద్యాలతో తేరుపైకి తీసుకువచ్చారు. ఆలయ ట్రస్టీ సురభి ఆదిత్యలక్ష్మారావు లాంచనంగా పూజలు నిర్వహించి తేరును ప్రారంభించారు. చెంచులు తమ ఆచారం ప్రకారం నర్సింహస్వామికి లాంచనాలు సమర్పించారు. ప్రధాన ఆలయం నుంచి రత్నగిరి కొండ వరకు తేరును భక్తులు లాగారు. అక్కడ శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత తిరిగి ప్రధాన ఆలయం వద్దకు తేరును తీసుకువచ్చారు. తేరును లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. రథోత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి పాలమూరుతోపాటు హైదరాబాద్, రాయలసీమ ప్రాంతం నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
దర్శించుకున్న నేతలు
లక్ష్మీనర్సింహస్వామి ఉత్సవమూర్తులను మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి దర్శించుకున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రథోత్సవం వెంట నడిచారు. సింగోటం గ్రామ సర్పంచ్ యాదన్నగౌడ్ దంపతులు లాంచనంగా పూజలు చేశారు. కాంగ్రెస్ నేత జూపల్లి అరుణ్, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు, వివిధ పార్టీల నాయకులు ఉత్సవమూర్తులను దర్శించుకొని పూజలు చేశారు. రథోత్సవ మహోత్సవంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. జాతర ప్రాంతానికి దూరంగా వాహనాలను నిలిపివేశారు.
కనులపండువగా సింగోటం లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం
సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించినసురభి రాజవంశీయులు
జనసంద్రంగా మారిన శ్రీవారి సముద్రకట్ట, జాతర ప్రాంగణం
ప్రత్యేక పూజలు చేసిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు


