ఉర్సులో జనసందోహం
అచ్చంపేట: మత సామరస్యానికి ప్రతీక అయిన మండలంలోని రంగాపూర్ హాజ్రత్ నిరంజన్‌షావలి ఉర్సు(జాతర) ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం అర్ధరాత్రి నుంచే రంగాపూర్‌కు చేరుకున్న ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం సాయంత్రం జనససందోహం నడుమ గంధోత్సవం వైభవంగా సాగింది.
దర్గాలో ప్రార్థనలు
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు హిందూ, ముస్లిం అనే భేద భావం లేకుండా ఉత్సవాల్లో పాల్గొన్నారు. కందూర్లు చేసి దర్గాలో ఫాతేహాలు ఇచ్చి మొక్కులు తీర్చుకొన్నారు. ఉత్సవాలు వారం రోజుల పాటు జరుగనున్నాయి.
ఉమామహేశ్వర క్షేత్రం సందర్శన
రంగాపూర్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో కొండపై వెలిసిన ఉమామహేశ్వర క్షేత్రాన్ని దర్గాలో ప్రార్థనల అనంతరం భక్తులు సందర్శించడం ఆనవాయితీ. రంగాపూర్ ఉర్సుకు మూడు రోజుల ముందే ఉమామహేశ్వర క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మత సామరస్యానికి దర్పణం పట్టే ఈ రెండు ఉత్సవాలు ఒకేసారి ముగుస్తాయి. జాతరకు భక్తులు పోటెత్తడంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. వాహనాలను క్రమబద్ధీకరించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. సంక్రాంతి సెలవులు చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో జాతరకు పోటెత్తారు.


