భార్యను దూరం చేశారు.. నేను బతకలేను
అమరచింత: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను దూరం చేశారన్నా మనస్తాపంతో పట్టణానికి చెందిన వడ్డే నర్సింహ (21) అనే యువకుడు ఆదివారం తెల్లవారు జామున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు.. పట్టణానికి చెందిన నర్సింహ తల్లి యాదమ్మతో కలిసి 15 ఏళ్లుగా శ్రీకృష్ణనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ గొర్రెల కాపరిగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన మర్రిపల్లి లక్ష్మన్న కుమార్తె అనితతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 20 రోజుల క్రితం నరసింహ, అనిత ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకొని 15 రోజుల కిందట అమరచింతకు వచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నామని తమకు రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్‌లో ఆఽశ్రయించారు. ఇరువురు మేజర్లు కావడంతో ఎస్‌ఐ స్వాతి ఇరువురి తల్లితండ్రులకు సమాచారం అందించారు. అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరిస్తూ వాగ్వాదానికి దిగారు. తీరా తమ కుమార్తెతో మాట్లాడి అబ్బాయికి పొలం, పోషించేందుకు స్తోమత లేదని 6 నెలల గడువు ఇద్దామని అంతలోపు అబ్బాయి పనిచేస్తూ సంపాదిస్తే అప్పుడు తామే పెళ్లి చేస్తామని నమ్మబలికి యువతిని ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం అనిత తండ్రి నరసింహను అమావాస్యలోపు నీ సంగతి చూస్తానని బెదిరించాడని మృతుడి తల్లి ఈరమ్మ ఆరోపించారు. పెళ్లి చేసుకున్న అమ్మాయిని దూరం చేశారనే బాధతో ఇక తాను బతకనంటూ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ స్వాతి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు చూడగా కాలనీ వాసులు అడ్డుకున్నారు. నిందితులపై చర్యలు తీసుకునే వరకు మృతదేహం తరలించేది లేదని వాగ్వాదానికి దిగారు.
ఉరేసుకొని యువకుడి బలవన్మరణం


