డబ్బులు ఇచ్చినోళ్లకే ఓటేస్తాం..
● లక్ష్మీపల్లి జీపీలో అభ్యర్థులతో గ్రామస్తుల బేరసారాలు
● సామాజిక మాధ్యమాల్లో వైరల్
బల్మూర్: పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఓటర్లు కొందరు.. తమకు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే గంపగుత్తగా ఓట్లు వేస్తామంటూ అభ్యర్థులతో బేరసారాలకు దిగారు. గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో సాగిన ఈ చర్చలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్లే.. బల్మూర్ మండలం లక్ష్మీపల్లి గ్రామ పంచాయతీలో 1,040 మంది ఓటర్లు ఉండగా.. చెంచుగూడెం, బిల్లకల్, వెంకటగిరి అనుబంధ గ్రామాలుగా ఉన్నాయి. ఈ జీపీలో ఆయా పార్టీల మద్దతుతో ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. గురువారం ఎన్నికల ప్రచారం చేస్తున్న అభ్యర్థులతో ఓటర్లతో కలిసి గ్రామ పెద్దలు బేరసారాలకు దిగారు. గ్రామంలోని సంఘాలు, ఆలయానికి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే ఓట్లేస్తామని చెప్పడంతో అభ్యర్థులు నివ్వెరపోయారు. అభ్యర్థులు, ఓటర్ల మధ్య సాగిన చర్చలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో మండల ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.


