ఎస్వీఎస్ ఆస్పత్రిలో తోరసిక్ సర్జరీలు
పాలమూరు: జిల్లాలోని ఎస్‌వీఎస్ ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన తోరసిక్ సర్జరీలు ప్రారంభించినట్లు ఆస్పత్రి ఎండీ డాక్టర్ కేజే రెడ్డి వెల్లడించారు. ఎస్‌వీఎస్ ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ గుండెపోటు, గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయన్నారు. ఉమ్మడి జిల్లాలో ఏటా 800 నుంచి వెయ్యి వరకు గుండె సంబంధిత సర్జరీల కోసం హైదరాబాద్ వెళ్తున్నారని అలా కాకుండా ఇకపై అన్ని రకాల సర్జరీలు ఎస్‌వీఎస్‌లో చేస్తున్నట్లు తెలిపారు. కార్డియో తోరసిక్ సర్జన్‌తో పాటు కార్డియో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి 24గంటల పాటు సేవలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆరోగ్య శ్రీతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డు, వంద రకాల ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో రూ.10 లక్షలు ఖర్చు అయితే స్థానికంగా కేవలం రూ.2 లక్షలతో సర్జరీలు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. హార్ట్‌లాంగ్ మిషన్, స్పెషల్ కార్డియాక్ ఐసీయూ, క్యాథ్‌ల్యాబ్, అత్యాధునిక మిషనరీ అందుబాటులో ఉంచినట్లు వివరించారు. కార్యక్రమంలో కార్డియో తోరసిక్ సర్జన్ అవేన్ సానర్, ప్రిన్సిపాల్ జోషి, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.


