నామినేషన్ చిక్కులు..
నవాబుపేట: గతంలో నామినేషన్ అనగానే ఒక కాగితంపై చిన్న డిక్లరేషన్ ఇచ్చి సంతకం చేసి ప్రపోజల్‌తో వెళ్తే సరిపోయేది. తాజా ఎన్నికల్లో అలాంటి వాటికి తావు లేకుండా వివిధ రకాల అంశాలు అడగడం విశేషం. దీంతో నామినేషన్ పత్రం నింపడం సైతం చాలామందికి గగనమైంది. పైగా ఆధార్, ఓటరు ఐడి, బ్యాంకు ఖాతా పుస్తకం తదితర జిరాక్స్ ప్రతులు సైతం జత చేయాల్సి ఉంటుంది. సర్పంచ్‌కు మాత్రమే ఈ నిబంధనలు అనుకుంటే పొరపాటే.. వార్డు సభ్యుడికి సైతం ఇదే తతంగం. కాగా పోటీదారులు అంరూ ఒకేసారి బ్యాంకు ఖాతా తెరవాల్సి వచ్చింది. మండలంలోని 42 గ్రామాలకు నవాబుపేట, కొల్లూర్‌లో ఎస్‌బీ ఐ బ్యాంకులు, నవాబుపేటలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు, కారుకొండలో కెనరా బ్యాంకు మొత్తం 4 మాత్రమే ఉన్నాయి. దీంతో చాలామంది పోటీదారులు గురువారం ఖాతాలు తెరిచేందుకు బ్యాంకుల ఎదుట పడిగాపులు పడటం కనిపించింది.


