లారీని ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనం
మహబూబ్‌నగర్ క్రైం/ హన్వాడ: ఎదురుగా వస్తున్న లారీని ఓ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టి పల్టీలు కొట్టి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. తమిళనాడు రాష్ట్రం చైన్నె నుంచి ముంబాయికి స్టీల్‌లోడ్‌తో వస్తున్న లారీని గుల్బర్గా నుంచి బెంగుళూరుకు ఇథనాల్ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ బుధవారం అర్ధరాత్రి మండలంలోని పిల్లిగుండు ప్రాంతంలో ఢీకొట్టింది. దీంతో స్టీల్ లోడ్‌తో వస్తున్న లారీ రోడ్డుకు ఎడమ పక్కకు పల్టీకొట్టగా ఆయిల్ ట్యాంకర్ కుడి పక్కకు పల్టీ కొట్టగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ అందులో ఇరుక్కొని మంటల్లో సజీవ దహనం అయ్యాడు. ఈ క్రమంలో భారీ శబ్ధం వినిపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిద్రలేచారు. ఎగసిపడుతున్న మంటలను గమనించి ఘటనా స్థలానికి చేరుకొని స్టీల్‌లోడ్‌తో ఉన్న లారీలో ఇరుక్కున డైవర్ లవకుష ప్రసాద్ మిశ్రాను అద్దాలు పగులగొట్టి ప్రాణాలతో కాపాడారు. మరోవైపు ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ మంటల్లో చిక్కుకుని సజీవదహనం అయ్యాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఫైర్ ఆఫీసర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుని దాదాపు మూడు గంటలపాటు శ్ర మించి భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. పోలీసు లు ట్రాఫిక్‌ను పూర్తిగా నియంత్రించి మంటలు అదుపు చేసే వరకు వాహనాలు అనుమతించలేదు. ఈ సందర్భంగా ఎస్పీ అగ్నిమాపక, పోలీస్ సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇచ్చి అప్రమత్తం చేశారు. ఆయి ల్ ట్యాంకర్ డ్రైవర్ నిరంజనప్ప(36) చించోలి తాలుకా పరిధిలోని హటుగల్లీకి చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు స్టీల్‌లోడ్ లారీ డ్రైవర్ లవకుష ప్రసాద్ మిష్రా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు.
● ఎస్పీ పర్యవేక్షణలో మంటలార్పిన ఫైర్ సిబ్బంది
● మూడు గంటల పాటు నిలిచిన వాహనాల రాకపోకలు


