పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నేతల రచ్చ
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో భూత్పూర్ మండలానికి చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం వీరంగం సృష్టించగా.. చివరికి పరస్పరం ఫిర్యాదులు చేసుకునే వరకు చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. ఈ నెల 15న జడ్చర్ల మండలంలోని బూరెడ్డిపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి–44పై భూత్పూర్ వైపు వెళ్తున్న చెన్నకేశవులుకు చెందిన కారును వెనుక నుంచి ఓ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ విషయమై కారు యజమాని చెన్నకేశవులు జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సీసీ పుటేజీ ద్వారా కారును ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్‌ను గుర్తించి సంబంధిత యజమానికి సమాచారం ఇచ్చి కేసు నమోదు చేశారు. అయితే తన కారును ఢీకొట్టిన ట్యాంకర్ యజమాని నుంచి పరిహారం ఇప్పించాలని పోలీసులను కోరగా.. యజమానిని హైదరాబాద్ నుంచి బుధవారం పిలిపించి మాట్లాడుకోవాలని పోలీసులు సూచించారు. ఇరువురి మధ్య చర్చలు విఫలం కావడంతో ట్యాంకర్ యజమాని హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో గురువారం కారు యజమాని చెన్నకేశవులు కొంతమందితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐ మల్లేష్‌ను సంప్రదించారు. దీంతో మరోసారి ట్యాంకర్ యజమానికి ఫోన్ చేయగా తనను కారు యజమాని బెదిరించారని, తన ట్యాంకర్‌ను కాల్చివేస్తామంటూ హెచ్చరించారని, తమపై ఎలాగో కేసు అయినందున తాను లాయర్‌తో వచ్చి ట్యాంకర్‌ను విడిపించుకెళ్తానంటూ ఫోన్‌లో ఎస్‌ఐకి చెప్పాడు. ఇదే విషయాన్ని ఎస్‌ఐ మల్లేష్ వారికి వివరిస్తుండగా.. లంచం తీసుకుని తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నావంటూ ఎస్‌ఐపై వారు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదేసమయంలో ఈ తతంగాన్ని వారి వెంట వచ్చిన ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ భీమేష్ వీడియో తీయవద్దంటూ అడ్డుకుని ఫోన్ లాక్కున్నాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత ఫోన్‌ను తిరిగి ఇవ్వగా బయటకు వెళ్లిన కొద్ది సేపటికే కాంగ్రెస్ పార్టీ భూత్పూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి.. కానిస్టేబుల్ భీమేష్‌ను దుర్బాషలాడుతూ కాలర్ పట్టుకోవడంతో గొడవకు దారి తీసింది. దీంతో అక్కడే ఉన్న మరో కానిస్టేబుల్ లక్ష్మప్ప వారించే ప్రయత్నం చేయగా ఆయనను సైతం తోసివేస్తూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడే ఉన్న మరో ఎస్‌ఐ జయప్రసాద్ వారిని సముదాయించి బయటకు పంపే ప్రయత్నం చేయగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని స్టేషన్ నుంచి బయటకు పంపగా అక్కడ కూడా తీవ్రస్థాయిలో పోలీసులను దూషించారు. దీంతో ఎస్‌ఐ జయప్రసాద్ బయటకు రాగా తోపులాట చోటుచేసుకోవడంతో ఎస్‌ఐ కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డిని లాక్కొచ్చి లాకప్‌లో వేశాడు.
ఎమ్మెల్యే జీఎంఆర్ రాక
విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని విచారించారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. కాగా లాకప్‌లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని బయటకు తీసుకువచ్చి సీఐ కమలాకర్ విచారించి వదిలిపెట్టారు. ఇందుకు సంబంధించి పరస్పర ఫిర్యాదులు చేసుకోగా.. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు సీసీ పుటేజీలను కూడా పరిశీలించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
జడ్చర్ల పోలీసులను దుర్బాషలాడిన కాంగ్రెస్ భూత్పూర్
మండలాధ్యక్షుడు
లాకప్‌లో వేసిన ఎస్‌ఐ..
ఠాణాకు వచ్చిన దేవరకద్ర ఎమ్మెల్యే
పరస్పర ఫిర్యాదులపై కేసులు
నమోదు.. డీఎస్పీ విచారణ


