అంతరాలు లేని సమాజం నిర్మిద్దాం
వనపర్తి: సమాజంలో కుల, మత, ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం భావిభారత పౌరులు కృషి చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింతకింది ఖాశీం పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన పీడీఎస్‌యూ రాష్ట్ర నాల్గవ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించి ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జార్జీరెడ్డి నాయకత్వంలో సాయుధ రైతాంగ పోరాటాల స్ఫూర్తితో 1974లో పుట్టిన పీడీఎస్‌యూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతుందన్నారు. మౌలిక వసతుల సాధన, విద్య ప్రైవేటీకరణకు, వ్యాపారీకరణకు వ్యతిరేకంగా చారిత్రాత్మక ఉద్యమాలను చేసిందని గుర్తుచేశారు. కాలానుగుణంగా వస్తున్న విద్యార్థి వ్యతిరేక సంస్కరణలతో సమాజం ఎదుర్కొంటున్న ఇబ్బందులను పీడీఎస్‌యూ ఎప్పటికప్పుడు ఖండిస్తూ.. విద్యార్థుల సంక్షేమానికి పోరాటాలు చేస్తోందన్నారు. విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కావొద్దని, సమాజాన్ని అధ్యయనం చేస్తూ.. సమస్యల పరిష్కారం కోసం గళం విప్పాలని పిలుపునిచ్చారు.
ఉస్మానియా యూనివర్సిటీ
ప్రొఫెసర్ ఖాసీం
విద్యను వ్యాపారంగా మార్చొద్దు
విద్యను వ్యాపారంగా మార్చడానికి డబ్ల్యూటీఓ–గాట్స్ ఒప్పందాల అమలుకు ప్రపంచ బ్యాంకు భారత పాలకవర్గాలపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొస్తుందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం.రాఘవాచారి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే దేశంలోకి విచ్చలవిడిగా విదేశీ కార్పొరేట్ యూనివర్సిటీలు తమ సంస్థలను ప్రారంభిస్తున్నాయని ఆరోపించారు. ఇది దేశంలోనే అణగారిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్రలో భాగమే అన్నారు. కార్యక్రమంయోల పీడీఎస్‌యూ జాతీయ నాయకులు విజయ్ కన్నా, కవి జనజ్వాల, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆరెల్లి కృష్ణ, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సరళ, ఆంధ్రప్రదేశ్ పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ రఫీ, కిరణ్‌కుమార్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్, రంజిత్, సతీష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


