 
															నవ వధువు మృతదేహంతో ధర్నా
● ప్రేమ పేరుతో మోసం చేసిన వాడిని శిక్షించాలని డిమాండ్
● బీఆర్‌ఎస్, బీజేపీ,పలు సంఘాల మద్దతు
కోస్గి: ప్రేమించిన వాడు మోసం చేశాడన్న మనస్థాపంతో, వేరే పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్న నవ వధువు మృతదేహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గురువారం రాత్రి పట్టణంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. స్థానిక శివాజీ చౌరస్తాలో మహబూబ్‌నగర్– తాండూర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. కుటుంబ సభ్యుల రోదనలతో ధర్నా ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంగా నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పలు పార్టీల నాయకులు బాధిత కుటుంబ సభ్యులకు మద్దతు తెలిపారు. సీఐ సైదులు, ఎస్‌ఐ బాల్‌రాజ్ ఆందోళనకారులతో మాట్లాడి కేసు వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని, ఉన్నతాధికారులతో మాట్లాడి నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని నచ్చజెప్పినా బాధిత కుటుంబ సభ్యులు వినిపించుకోలేదు. ఎస్పీ, కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నారాయణపేట డీఎస్పీ లింగయ్య సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిపై కేసు నమోదు చేయడంతో పాటు అతడికి కఠిన శిక్ష పడేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ధర్నాలో పలు పార్టీలు, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 
							నవ వధువు మృతదేహంతో ధర్నా

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
