ఇదేం పద్ధతి గురూ..! | - | Sakshi
Sakshi News home page

ఇదేం పద్ధతి గురూ..!

Oct 31 2025 8:52 AM | Updated on Oct 31 2025 8:52 AM

ఇదేం పద్ధతి గురూ..!

ఇదేం పద్ధతి గురూ..!

పాఠశాలల్లో పెరుగుతున్న కీచక ఉపాధ్యాయులు

తరుచుగా వెలుగులోకి విద్యార్థినులపై వేధింపులఘటనలు

ఇటీవల వరుసగా టీచర్లపైోపోక్సో కేసులు నమోదు

తాజాగా షాసాబ్‌గుట్ట పాఠశాలలో లైంగిక వేధింపులు

ఆందోళన చెందుతున్న

విద్యార్థినుల తల్లిదండ్రులు

మహబూబ్‌నగర్‌ క్రైం: ‘ఓ ఉపాధ్యాయుడి కీచక చేష్టలు ఆ వృత్తికే మచ్చ తీసుకొచ్చే విధంగా ఉన్నాయి. జిల్లాకేంద్రంలోని ఓ పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తెలుగు టీచర్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. రూరల్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంని పిల్లలమర్రి రోడ్డులోని షాసాబ్‌గుట్ట ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు పెరుమాళ్ల కృష్ణస్వామి 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తుంటాడు. అయితే కొన్నిరోజుల నుంచి 8, 10వ తరగతి విద్యార్థినులను అసభ్యకరంగా తాకడం, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అతని చేష్టలతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఇటీవల 8వ తరగతి విద్యార్థినిని లైంగికంగా వేధించగా.. తండ్రి ఫిర్యాదుతో ఈ నెల 28న రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఇదే ఉపాధ్యాయుడు గతేడాది పదో తరగతి విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు సమాచారం. ఆ తర్వాత సదరు ఉపాధ్యాయుడు దాదాపు నాలుగు నెలలపాటు వ్యక్తిగత సెలవులో వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల మళ్లీ విధుల్లో చేరి ఒక అమ్మాయిని టార్గెట్‌ చేసి పదేపదే ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో విసిగిపోయిన విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం చెప్పగా.. పోలీసులను ఆశ్రయించారు. మొదట షీటీం, భరోసా పోలీసులు దీనిపై విచారణ చేయగా.. లైంగిక వేధింపులు నిజమేనని నిర్ధారణ కావడంతో రూరల్‌ పోలీసులకు విషయం చెప్పగా.. కేసు నమోదు చేశారు.

వరుసగా నాలుగో ఘటన

జిల్లాలో ఈ మూడు నెలల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నాలుగు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ధర్మాపూర్‌, వీరన్నపేట, రాజాపూర్‌ పాఠశాలలు కాగా.. ప్రస్తుతం షాసాబ్‌గుట్ట ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. ధర్మాపూర్‌, వీరన్నపేట ఘటనలలో ఉపాధ్యాయులపై కేసులు నమోదు కాగా.. రాజాపూర్‌ ఘటనలో తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చి ఫిర్యాదు ఉపసంహరించుకునేలా చేసినట్లు సమాచారం. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడంతో సదరు ఉపాధ్యాయుడిని డీఈఓ సస్పెండ్‌ చేశారు.

వీటిపై దృష్టిసారిస్తేనే..

లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. ఈ చట్టం కింద శిక్షలు కఠినంగా ఉంటాయనే విషయం తెలియాలి. వేధింపులకు పాల్పడే ఉపాధ్యాయులపై తక్షణమే శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలతోపాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి. విద్యార్థులు ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి. బాలల హెల్ప్‌లైన్‌ నంబర్‌–1098తోపాటు షీటీం నెంబర్‌, డయల్‌ 100కు ఫిర్యాదు చేయాలని పాఠశాలల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలి.

విధుల నుంచి తొలగించాం..

షాసాబ్‌గుట్ట ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని సమాచారం రావడంతో పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. విధుల నుంచి తొలగించాం. గతేడాది ఇతనికి తెలుగు ఉపాధ్యాయుడిగా అప్‌గ్రేడేషన్‌ రావడంతో బదిలీపై ఈ పాఠశాలకు వచ్చాడు. ప్రస్తుతం ఒక అమ్మాయిని లైంగికంగా వేధించినట్లు తెలిసింది.

– ప్రవీణ్‌కుమార్‌, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement