మార్మోగిన గోవిందనామస్మరణ
చిన్నచింతకుంట: అమ్మాపురం కురుమూర్తిస్వామి జాతరకు శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ సిబ్బంది ఉదయమే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ముందుగా కోనేరులో స్నానాలు ఆచరించి.. దాసంగాలు సిద్ధం చేశారు. మెట్ల మార్గం గుండా కొబ్బరికాయలు కొడుతూ గోవిందనామస్మరణతో స్వామి వారి చెంతకు చేరుకున్నారు. దాసంగాలు సమర్పించి.. చల్లంగా చూడాలని వేడుకున్నారు. మరికొందరు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ ఇంటి ఇలవేల్పుకు గండదీపాలు మోశారు. కొండపైన అలువేలు మంగమ్మ, ఆంజనేయస్వామి, ఉద్దాల మండపం, చెన్నకేశవ స్వామి ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతర మైదానంలో ఏర్పాటు చేసిన దుకాణాలలో వివిధ వస్తువులను కొనుగోలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మధనేశ్వరెడ్డి తగు చర్యలు చేపట్టారు.
● కురుమూర్తిస్వామిని జోగుళాంబ జోన్ – 7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహన్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా..డీఐజీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చిన్నచింతకుంట ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.
కురుమూర్తిస్వామి జాతరకు
తరలివచ్చిన భక్తజనం


