బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
కోస్గి రూరల్: కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు శ్రీలత ఆత్మహత్యకు కారణమైన బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు తిరుపతిరెడ్డిల అండ చూసుకొని స్థానికంగా కొందరు నాయకులు కోస్గి, మద్దూరు మండలాల్లో భూదందాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని, అమాయకులపై అక్రమంగా కేసులు పెట్టి రాయలసీమ ఫ్యాక్షనిస్టులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో ఆత్మహత్యకు పాల్పడిన శ్రీలత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రవంచకు చెందిన శ్రీశైలం వేధింపుల కారణంగానే శ్రీలత ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. నిందితుడికి సహకరిస్తున్న నాయకులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. దందాలకు పాల్పడుతున్న వ్యక్తులకు పోలీసులు సైతం వత్తాసు పలుకున్నారని విమర్శించారు. కోస్గి ఎస్‌ఐ కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడని, ఆయన ఉద్యోగం వదిలి సీఎం రేవంత్‌రెడ్డి ఇంట్లో పని చేయాలని సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సాయిలు, పోశప్ప వెంకట్ నర్సిములు, కోనేరు సాయిలు, నిరంజన్‌రెడ్డి, బాల్‌నర్సయ్య, నీలప్ప, వెంకటేష్, రాములు, తదితరులున్నారు.


