కురుమూర్తి సన్నిధిలో.. నల్లమలరాజాల సందడి
● జాతరలో చుక్కల పశువులకు డిమాండ్
● తూర్పుజాతి సంతతిగా కొనుగోలుకు రైతుల ఆసక్తి
● రూ.లక్షల్లో వెనకేసుకుంటున్న వ్యాపారులు
నల్లమల అటవీ ప్రాంతంలోని దోమలపెంట, మద్దిమడుగు, ఈగలపెంట, మన్ననూరు, కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చే ఆవులు, ఎద్దులు, దూడలే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నల్లమల కొండల్లో తిరిగే ఈ జీవాలు వాతావరణంలో చోటు చేసుకొనే అన్ని కఠిన పరిస్థితులను తట్టుకొని మనుగడ సాగిస్తాయి. అడవుల్లో ఉండే రాళ్ల మధ్య ఇవి మేత కోసం తిరుగుతుండడంతో కాళ్ల గిట్టలు బలంగా ఉంటాయి. తీవ్రమైన చలి, ఎండ నుంచి కాపాడుకునేందుకు శరీరం, కండరాలను దృఢంగా ఉంచుకుంటాయి.
ధైర్యానికి, పట్టుదలకు ప్రతీక
నల్లమల జీవాలు కేవలం పాల కోసమే కాకుండా వ్యవసాయంలో కూడా రైతుకు తోడుగా ఉంటాయి. ఈ తూర్పుజాతి పశువులు ధైర్యానికి, పట్టుదలకు ప్రతీకగా నిలుస్తాయి. దట్టమైన అడవుల్లోని మృగాలతోనూ పోరాడే శక్తి, తమ యజమానిపై విశ్వాసంగా ఉండడం ఈ పశువులను ప్రత్యేకంగా నిలిచేలా చేస్తున్నాయి. సుమారు 45 ఏళ్లుగా ఈ పశువుల సంత కురుమూర్తి జాతరలో సాగుతుండగా.. నల్లమల నుంచి వచ్చే జీవాలను కొనుగోలు చేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తారు. చుక్కల ఆవులు, దూడలు, ఎద్దులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. చుక్కలతో ఉండే ఆవులు అదృష్టాన్ని తెస్తాయని అన్నదాతలు నమ్ముతారు. వీటి క్రయవిక్రయాల ద్వారానే వ్యాపారులు రూ.లక్షల్లో వేనకేసుకుంటారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
రెండు రోజులే..
కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర కేవలం భక్తి ప్రపత్తులకే పరిమితం కాకుండా.. పశువుల పండువగాను విరాజిల్లుతోంది. ఒకవైపు శ్రీకురుమూర్తిస్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ.. గోవింద నామస్మరణ మార్మోగితే.. మరోవైపు పశువుల సందడి.. చిరు వ్యాపారుల హడావుడి.. ఇలా అన్నీ కలిసి సజీవ చిత్రమై కనిపిస్తాయి.
– మదనాపురం
రాజసం ఉంటుంది..
నల్లమల నుంచి వచ్చే చుక్కల ఆవులు, ఎద్దులను చూడగానే అందులో రాజసం కనిపిస్తుంది. వాటి కళ్లలో ధైర్యం ఉంటుంది. బలమైన ఎద్దు పొలంలో దిగి.. దుక్కి దున్నితే మట్టి కుంకుమలా మారాల్సిందే. అందుకే రైతులు రూ.వేలు ఖర్చు చేసి చుక్కల ఎద్దులు, ఆవులను కొనుగోలు చేస్తారు. మేం చిన్నతనం నుంచే ఈ వ్యాపారంలో ఉన్నాం. మా నాన్న కూడా ఇలానే జాతరకు పశువులు తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఈ జాతర మా కుటుంబ సంప్రదాయం మారింది. నల్లమల ఆవు అమ్మినప్పుడు మేము దానిని దేవతలకే సమర్పించినట్లుగా భావిస్తాం.
– వెంటకయ్య, వ్యాపారి, ఇంజమూరు
జాతర ప్రారంభమైన మొదటి రెండు రోజులే పశువుల సంత ఉంటుంది. కొందరు వ్యాపారులు కురుమూర్తిస్వామి గుడిలో మొదట పూజలు చేసి.. తర్వాతే పశువుల విక్రయానికి దిగుతారు. పశువును కొన్న రైతు దానికి తలపాగ చుట్టి.. బెల్లం ముక్కతో మొదటి పూజ చేసి.. ఈ ఏడాది పంట బాగుండాలి అని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ పశువులను రైతులు తమ కుటుంబ సభ్యుడితో సమానంగా ఆదరిస్తారు. 45 ఏళ్ల చరిత్రలో ఇది కేవలం సంత మాత్రమే కాకుండా.. ఈ ప్రాంత రైతుల సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తోంది.
కురుమూర్తి సన్నిధిలో.. నల్లమలరాజాల సందడి


