
ఆకస్మిక వరదలపై అప్రమత్తంగా ఉండాలి
జడ్చర్ల: వర్షాలు కురిసి వరదలు వస్తున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శుక్రవారం కిష్టారం– అంబటాపూర్ ప్రధాన రహదారిపై సమీప చెరువు అలుగు ఉధృతిలో వృద్ధ దంపతులు బాలయ్య, రాములమ్మ గల్లంతైన స్థలాన్ని ఆమె పరిశీలించి.. సహాయక చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాగులు, వంకలు దాటుతున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాద పరిస్థితులను ముందుగానే అంచనా వేయాలని, చెరువులు, జలాశయాల వద్దకు వెళ్లవద్దన్నారు. అలుగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రహదారిపై అటు ఇటుగా కంప చెట్లు వేసి రాకపోకలను నిలిపివేసినా కొందరు కొనసాగించారని, ఇలాంటి క్రమంలోనే వీరిని కూడా గ్రామస్తులు హెచ్చరించారన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. చెరువులు అలుగులు పారుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రమాద నివారణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కాగా కిష్టారం– అంబటాపూర్ ప్రధాన రహదారిపై ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఉంటుందని, ఇక్కడ వంతెన నిర్మించి రాకపోకలకు వీలు కల్పించాలని గ్రామస్తులు కలెక్టర్‌ను కోరారు. ఇదిలా ఉండగా.. గల్లంతైన వృద్ధ దంపతుల కోసం సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరవగా కలెక్టర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. అంతకు ముందు కలెక్టర్ వాహనం ఘటనా స్థలానికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో బైక్‌పై వెళ్లి సమీక్షించారు. కార్యక్రమంలో ఆర్డీఓ నవీన్‌కుమార్, జిల్లా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ కిషోర్‌కుమార్, తహసీల్దార్ నర్సింగరావు, ఎంపీడీఓ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. కలెక్టరేట్‌నుంచి అధికారులతో నిర్వహించిన వీసీలో ఆమె మాట్లాడారు. జిల్లాలో కాజ్‌వేలు, చెరువులు, కుంటలు, రోడ్లపై లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు ప్రవహిస్తున్న చోట అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకోవాలన్నారు. మండలాధికారులు ర్యాపిడ్ రెస్క్యూ టీం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి వివరాలను తెలుసుకోవాలన్నారు. జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ పద్మజ, డీపీఓ పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.