చికిత్స పొందుతూ వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

Oct 9 2025 6:27 AM | Updated on Oct 9 2025 3:37 PM

ఇటిక్యాల: చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన ఘటన ఇటిక్యాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రవినాయక్‌ కథనం ప్రకారం.. మండలంలోని సాతర్లకు చెందిన ఈడిగి దేవెందర్‌ (35) మత్తిస్థిమితం బాగలేక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుంటుంబ సభ్యులు కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. బుధవారం మృతిచెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతోయువకుడి ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌ క్రైం: పెళ్లయి ఏడాది.. భార్య గర్భిణి.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. రూరల్‌ 2వ ఎస్‌ఐ భూపాల్‌రెడ్డి కథనం ప్రకారం.. నవాబ్‌పేటకు చెందిన నరేందర్‌(20) పాలమూరులోని లక్ష్మీనగర్‌కాలనీ ఫ్యారడైజ్‌ ఫంక్షన్‌ హాల్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కొన్నిరోజుల నుంచి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈనెల 7న అర్ధరాత్రి ఫంక్షన్‌ హాలులో అతను నివాసముండే గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. 

ఏడాది కిందట దేవి అనే యువతితో పెళ్లికాగా.. ప్రస్తుతం గర్భిణి. కాన్పునకు తల్లిగారింటికి వెళ్లింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు భార్యకు ఫోన్‌ చేసి ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పగా.. దేవి వెంటనే కుటుంబసభ్యులను ఫంక్షన్‌ హాల్‌ వద్దకు పంపగా.. అప్పటికే ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రైతు ఆత్మహత్యాయత్నం

కోస్గి రూరల్‌: వ్యవసాయ పొలానికి వెళ్లే దారి విషయంలో దాయాదుల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుండుమాల్‌ మండలంలోని అమ్లికుంటలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ బాలరాజు కథనం ప్రకారం.. అమ్లికుంటకు చెందిన మాల అంజిలయ్య తమ వ్యవసాయ పొలంలో కూరగాయల సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పక్క పొలం దాయాదులు పొలంలోకి వెళ్లేదారిని మూసివేశారు. నాలుగు రోజులు గడుస్తున్నా.. వెళ్లనీయకపోవడంతో పొలం దగ్గరున్న గడ్డిమందును తాగాడు. చుట్టుపక్కలవారు గమనించి కోస్గి ఆస్పత్రికి తరలించారు. అంజిలయ్య భార్య అంజిలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్‌ఐ తెలిపారు.

ఎనిమిది పాడిఆవుల మృతి

వెల్దండ: మండలంలోని రాచూర్‌తండాలో పాత్లావత్‌ పర్షనాయక్‌కు చెందిన ఎనిమిది పాడిఆవులు మృతిచెందాయి. రైతు కథనం ప్రకారం.. ఈనెల 3వ తేదీనుంచి ఆవులు ఒక్కొక్కటి మృతి చెందినట్లు వాపోయాడు. రూ.5లక్షలకుపైగానే నష్టం జరిగిందని.. ప్రతిరోజూ పాలుసేకరించి జీవనం సాగిస్తుండగా.. ఒక్కసారిగా ఎనిమిది ఆవులు మృతిచెందడంతో దిక్కుతోచని స్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం బాధిత రైతును ఆదుకోవాలని తండావాసులు పేర్కొన్నారు. 

ఈ విషయంపై పశువైద్యాధికారి శ్యామ్‌సుందర్‌ను వివరణ కోరగా.. బీరుపిట్టు, కలుషితదాన, అధిక మోతాదులో ముదురు గడ్డి ఇవ్వడంతోపాటు లవణలోపాల కారణంగా మృతిచెంది ఉండవచ్చని పేర్కొన్నారు. మృతికి కారణాల నిర్ధారణకు మహబూబ్‌నగర్‌ పశువ్యాధి నిర్ధారణ సంస్థకు రక్తం, పేడ, ధాన, గడ్డి నమూనాలను సేకరించి పరిశీలనకు పంపినట్లు తెలిపారు. మృతిచెందిన ఆవులను పోస్టుమార్టం చేసి పరిశీలించగా కడుపులో జీర్ణంకాని గడ్డి, రక్తంలో మార్పు గమనించినట్లు వివరించారు.

అరుదైన వ్యాధితోచిన్నారి మృతి

గోపాల్‌పేట: ఏదుల మండల కేంద్రానికి చెందిన కోడిగంటి రంజిత్‌, హైమావతి దంపతుల పెద్దకూతురు కోడిగంటి విహాన(4) అరుదైన వ్యాధితో మృతిచెందింది. విహాన నెల క్రితం ఆటలు ఆడుకుంటూ కింద పడిపోయింది. తల్లితండ్రులు కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పాపకు మైటోకాండ్రియా అనే వ్యాధి సోకిందని వైద్యులు నిర్ధారించారు. తల్లితండ్రులు విరాళాలు సేకరించి వైద్యం చేయించారు. 15రోజుల క్రితం నిమ్స్‌లో చేర్పించి ఇటీవల ఆపరేషన్‌ చేశారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున చిన్నారి మృతిచెంది. రూ.25లక్షల వరకు ఖర్చు పెట్టినా పాప బతకలేదని తల్లితండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం సాయంత్రం ఏదులలో నిర్వహించిన అంత్యక్రియలకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఫోరం జాతీయ అధ్యక్షుడు జెట్టి ధర్మరాజుతోపాటు కొత్తకుమార్‌, గ్రామస్తులు హాజరై విహాన తల్లిదండ్రులను ఓదార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement