
సంక్షేమం అమలులో ప్రభుత్వం విఫలం
● వ్యవసాయ కార్మిక సంఘంరాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమం అమలులో విఫలమైందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. వ్యవసాయ కూలీలకు రైతు భరోసా కింద రూ.12వేలు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. ఇందిరా మహిళా శక్తి కింద లబ్ధిదారుల ఎంపికలోనూ తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. ఇంటి స్థలం లేని నిరుపేదలకు 120 గజాల ప్రభుత్వ స్థలం కేటాయించడంతోపాటు ఇల్లులేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వాలన్నారు. ఆసరా పింఛను రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు రూ.10లక్షలు ఇవ్వాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్ల చరిత్ర తలదించుకోవడం తప్పా.. తలెత్తుకునేలా లేదన్నారు. కోర్టులో న్యాయమూర్తిని చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించడం వారి నైతికతకు నిదర్శనమన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జగన్, మోహన్, హన్మంతు, రాములు, పాండు, శివలీల, యాదయ్య పాల్గొన్నారు.

సంక్షేమం అమలులో ప్రభుత్వం విఫలం