
అనుమానం పెనుభూతమై..
● కట్టుకున్న భార్యను హతమార్చిన భర్త
● నిందితుడి అరెస్టు.. రిమాండ్
● డీఎస్పీ లింగయ్య వెల్లడి
మక్తల్: అనుమానంతో కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి హతమార్చిన భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నారాయణపేట డీఎస్పీ ఎన్.లింగయ్య తెలిపారు. బుధవారం మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో హత్యకేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. మక్తల్ మండలం సత్యవార్‌కు చెందిన వినోద (35)కు, కర్నూలు జిల్లాకు చెందిన కృష్ణారెడ్డితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ఏడాది గడవకముందే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలోనే బతుకుదెరువు నిమిత్తం ఇద్దరు హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ కూడా తరచుగా గొడవ పడుతుండే వారు. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా ఫలితం లేకపోయింది. దీంతో వినోద తండ్రి సత్యారెడ్డి ఆమెను స్వగ్రామానికి తీసుకొచ్చారు. గ్రామంలోనే కూలీ పనులు చేసుకొని జీవనం సాగించేది. అయితే వినోద భర్త కృష్ణారెడ్డి వారం, పది రోజులకోసారి భార్య వద్దకు వచ్చి వెళ్లేవాడు. ఎప్పుడైనా వినోద ఫోన్ బిజీ వస్తే అనుమానం వ్యక్తంచేస్తూ గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే అనుమానం పెనుభూతమై తన భార్యను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. రెండు, మూడుసార్లు హతమార్చేందుకు విఫలయత్నం చేశాడు. గత నెల 27న దసరా పండుగ నిమిత్తం హైదరాబాద్ నుంచి స్కూటీపై సత్యవార్‌కు వచ్చిన అతడు.. పథకం ప్రకారం పదునైన కత్తి తీసుకొచ్చాడు. ఈ నెల 3న దసరా పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కలిసి పొలం వద్ద భోజనాలు చేసేందుకు బయలుదేరారు. అయితే తన స్కూటీ టైరులో గాలి తక్కువగా ఉందని పేర్కొంటూ తన కుమారుడు అక్షిత్‌రెడ్డిని అత్తగారి వెంట పంపించాడు. ఆ తర్వాత వినోదను స్కూటీపై ఎక్కించుకొని బయలుదేరిన అతడు.. ఫోన్‌లో తరచుగా ఎవరితో మాట్లాడుతున్నావంటూ మార్గమధ్యంలో గొడవ పడ్డాడు. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడవటంతో పాటు గొంతుకోసి హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై మృతురాలి తల్లి సబ్బు తిప్పమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బుధవారం మహబూబ్‌నగర్‌లో నిందితుడి ని పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. హత్య చేసేందుకు ఉపయోగించిన స్కూటీ, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అతడిపై హైదరాబాద్‌లోని పలు పోలీస్‌స్టేషన్‌ల్లో కేసులు ఉన్నాయన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ రాంలాల్, ఎస్‌ఐలు భాగ్యలక్ష్మీరెడ్డి, అశోక్‌బాబు, సిబ్బంది అశోక్, నరేశ్, శ్రీకాంత్, శశిధర్‌గౌడ్, శ్రీహరిగౌడ్ ఉన్నారు. నాలుగు రోజుల్లో నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.