
జోగుళాంబ.. నమామ్యహం
ధ్వజ అవరోహణం..
అలంపూర్: అలంపూర్ ఆలయాల్లో పదిరోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ముగిశాయి. ఆలయ ఈఓ దీప్తి, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం దశమిరోజు యాగశాలలో పూర్ణాహుతి, జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వరస్వామి నదీ స్నానం, అమ్మవారి ఆలయంలో ధ్వజ అవరోహణం తదితర కార్యక్రమాలు జరిగాయి. అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ ఎమ్మెల్యే విజయుడు, ఆలయ అధికారుల సమక్షంలో ధ్వజ అవరోహణం నిర్వహించారు. అనంతరం దీక్షాపరులు కంకణ విసర్జన చేశారు.
యాగశాలలో పూర్ణాహుతి..
ఉత్సవాల చివరిరోజు యాగశాలలో పుర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. అవాహిత దేవతలకు ఉద్యాసన పలుకుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈఓ దీప్తి, పాలక మండలి సభ్యులు యాగశాలలో పూజలు నిర్వహించారు. జోగుళాంబ దీక్ష స్వాములు ఇరుముడులతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి యాగశాలకు తీసుకొచ్చారు. అక్కడ యాగపూజలు నిర్వహించిన అనంతరం పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అర్చకులు, భక్తులు మంగళవాయిద్యాలతో యాగశాల ప్రదక్షిణలు చేశారు.
పుష్కరఘాట్‌లో తీర్థావళి..
ఉత్సవాల చివరిరోజు త్రిశూల స్వామి, జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి వారి చక్ర తీర్థావళి జరిగింది. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, త్రిశూల స్వామిని పల్లకీలో యాగశాలకు తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసిన కలశాలను ఆలయ కమిటీ సభ్యులు, ఈఓ తలపై పెట్టుకొని నవధాన్యాల మొలకలతో మంగళ వాయుద్యాల నడుమ తుంగభద్ర పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. అర్చకులు ఉత్సవ బలిభేరి, ఉత్సవ విగ్రహాలతో నదికి చేరుకొని పూజలు నిర్వహించారు. అనంతరం త్రిశూల స్వామికి, జోగుళాంబ మాతలకు చక్రతీర్థ స్నానాలు గావించారు. ఆ జలాల్లో భక్తులంతా పుణ్యస్నానాలు ఆచరించారు.
అలంపూర్ ఆలయాల్లో ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు
చివరిరోజు పూర్ణాహుతి, ఆది దంపతుల అవభృద స్నానం, ధ్వజ అవరోహణం
భారీగా తరలివచ్చిన భక్తులు

జోగుళాంబ.. నమామ్యహం