
ఉమ్మడి జిల్లాలో ఎస్‌జీఎఫ్ జోష్
● అండర్–14, 17, 19 విభాగాలకు టోర్నీలు
● ఎనిమిది రాష్ట్రస్థాయి పోటీలకు ఆతిథ్యం
మహబూబ్‌నగర్ క్రీడలు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా జోష్ నెలకొనుంది. రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు క్రీడాటోర్నీల నిర్వహణలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పిస్తూ ఎస్‌జీఎఫ్ టోర్నీలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాటోర్నీల కేటాయింపులో ప్రతి ఏడాది ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మండలస్థాయిలో ఎస్‌జీఎఫ్ క్రీడలు ముగింపు దశకు చేరాయి. జిల్లాస్థాయి ఎంపికలు కూడా జరుగుతున్నాయి. త్వరలో ఉమ్మడి జిల్లా ఎంపికలు, టోర్నమెంట్లు నిర్వహించనున్నారు.
● కొన్నేళ్ల నుంచి పలు ఎస్‌జీఎఫ్ జాతీయ స్థాయి పోటీలకు ఉమ్మడి పాలమూరు జిల్లా అతిథ్యం ఇస్తోంది. గత ఏడాది జాతీయస్థాయి అండర్–19 ఎస్‌జీఎఫ్ వాలీబాల్ బాలుర టోర్నమెంట్, ఈ ఏడాది జనవరిలో జాతీయస్థాయి అండర్–17 విభాగం బాలబాలికల హ్యాండ్‌బాల్ టోర్నీలను విజయవంతంగా నిర్వహించారు. మళ్లీ ఈ ఏడాది జిల్లాలో 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ క్రికెట్ అండర్–17 బాలుర, బాలికల చాంపియన్‌షిప్‌లు నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి టోర్నీల అనంతరం జాతీయస్థాయి పోటీలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా అండర్–14, అండర్–17తో పాటు అండర్–19 విభాగాలకు ఈ ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎనిమిది రాష్ట్రస్థాయి క్రీడా టోర్నీలు కేటాయించారు.
● మహబూబ్‌నగర్ జిల్లాకు అండర్–17 విభాగం బాలికల వాలీబాల్, అండర్–17 విభాగం బాలబాలికల క్రికెట్ టోర్నీలు, అండర్–19 విభాగం బాలబాలికల హ్యాండ్‌బాల్ రాష్ట్రస్థాయి టోర్నీలు కేటాయించారు.
● వనపర్తి జిల్లాకు అండర్–17 విభాగం బాలుర, బాలికల హాకీ రాష్ట్రస్థాయి టోర్నీ అతిథ్యం దక్కింది.
● నారాయణపేట జిల్లాకు అండర్–19 బాలుర, బాలికలు రెజ్లింగ్, అండర్–14 బాల, బాలికల హ్యాండ్‌బాల్ టోర్నీలు కేటాయించారు.
● నాగర్‌కర్నూల్ జిల్లాకు అండర్–19 విభాగం బాలబాలికల మల్కం టోర్నీ నిర్వహించనున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాకు అండర్–14 బాలబాలికల విభాగం బీచ్ వాలీబాల్ టోర్నీ కేటాయించారు.